ఓ నిండు గర్భిణీ రైలులోనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన లెంక సరిత ముంబయిలో ఉపాధి పొందుతూ జీవిస్తోంది. లాక్డౌన్, కరోనా వైరస్ వ్యాప్తితో ఉపాధి కోల్పోయిన ఆమె కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడింది. సరిత నిండు గర్భిణీ కావడం వల్ల సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. చేసేదేమీ లేక సరిత కుటుంబ సభ్యులు సొంతూరుకు కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు.
ఈ క్రమంలోనే సరితకు పురిటినొప్పులు మొదలయ్యాయి. రైలు అనకాపల్లికి చేరేసరికి ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సమాచారం తెలుసుకున్న అనకాపల్లి స్టేషన్ సిబ్బంది సరితను 108లో స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని... రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.