ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే జిమ్‌లకు వెళ్లాలనుకునే సంస్కృతి క్రమంగా మారి.. ఖాళీ దొరికితే జిమ్‌కు వెళ్లే వారి సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. అర్ధరాత్రి వేళల్లోనూ పారిశ్రామిక నగరం విశాఖలో పలు ఐటీ, పారిశ్రామిక సంస్థలు నిరంతరాయంగా పనిచేస్తుంటాయి. పలువురు ఉద్యోగులు మూడు షిఫ్టుల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నారు. అలాంటి వారు వారి షిఫ్టులకు అనుగుణంగా ఇతర కార్యక్రమాలను నిర్వర్తించుకోవాల్సి వస్తోంది. వృత్తిపరమైన, వ్యక్తిగతమైన కారణాలతో ఉదయం నుంచి రాత్రి వరకు తీవ్రమైన పనిఒత్తిడిలో ఉండేవారు కూడా ఆరోగ్య పరిరక్షణ కోసం రాత్రి పది గంటల దాటిన తరువాత కూడా జిమ్‌లకు వెళ్తున్నారు. ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు కనీసం గంటపాటైనా వ్యాయామం చేయడం అవసరమని అత్యధికులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అర్ధరాత్రి సమయాల్లో కూడా జిమ్‌లు పుట్టుకొచ్చాయి.
విశాఖపట్నంలో సుమారు 150 జిమ్‌లు ఉండగా.. వాటిలో 30వేలకు పైగా రోజు వ్యాయామాలు చేస్తున్నారు. అయితే ఇందులో కొన్ని జిమ్‌లు రాత్రి పది దాటిన తరువాత కూడా వ్యాయామాలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. సుమారు 150 మందికి పైగా నగరవాసులు రాత్రి వేళల్లో వ్యాయామాలు చేస్తున్నారు.
ఆకట్టుకుంటున్న అధునాతన ఉపకరణాలు:
జిమ్ యాజమాన్యాలు అత్యాధునిక ఉపకరణాలతో వ్యాయామాలు చేసేవారిని ఆకట్టుకుంటున్నాయి. దీంతో జిమ్ వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శరీరానికి తగినట్టుగా ఉపకరణాలను జిమ్ యాజమాన్యం ఏర్పాటు చేస్తున్నారు. జిమ్‌కు వచ్చేవారి వయస్సు, ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారికి ఉపయుక్తంగా ఉండే తేలికపాటి వ్యాయామాలనే తొలుత సాధన చేయిస్తున్నారు. జిమ్లలోని శిక్షకులు కేవలం వివిధ వ్యాయామాలను సాధన చేయించడమే కాకుండా ఆరోగ్యానికి అవసరమైన పోషక విలువలున్న ఆహారం తీసుకోవడంపైనా చక్కటి సలహాలు సూచనలు ఇస్తున్నారు. వ్యాయామం చేయడానికి అవసరమైన శక్తిసామర్థ్యాలు వారిలో పెంచడానికి కృషిచేస్తున్నారు.
జిమ్ సమయంతో వ్యసనాలకు దూరం:
శరీరం కొంతకాలంపాటు వ్యాయామాలకు అలవాటు పడితే తరువాత రోజుల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. జిమ్‌లకు వెళ్లడంగానీ, ఇతర శారీరక వ్యాయామాలపై దృష్టిసారించిన వారికి ఆరోగ్య స్పృహ పెరిగి మద్యం, సిగరెట్టు వంటి హానికర అలవాట్లకు కూడా దూరమవుతున్నామని కొందరు చెప్తున్నారు. వ్యసనాలకు దూరమయ్యే అవకాశం.. ఖాళీ సమయాల్లో బార్లు, పబ్‌లకు వెళ్లడం, సిగరెట్లతో కాలక్షేపం చేయడం కన్నా శరీరారోగ్యాన్ని పెంచే జిమ్‌కు వెళ్తే ఆరోగ్యానికి అత్యంత ఉపయుక్తంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అందుకు ఏ సమయంలోనైనా కొద్ది సేపు వ్యాయామం చేస్తే దీర్ఘకాలంలో ప్రయోజనం ఉంటుందని.. వ్యసనాలకు దూరమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
వేలి ముద్రలతో జిమ్‌లోకి ప్రవేశం
అర్ధరాత్రుల్లో జిమ్‌లకు వచ్చేవారి కోసం జిమ్ యజమానులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. రాత్రి వేళల్లో జిమ్‌లోకి ఇతర వ్యక్తులు ప్రవేశించకుండా వేలిముద్ర ద్వారా తాళం తెరుచుకునే ఏర్పాట్లు చేశారు. రాత్రి సమయాల్లో జిమ్‌లకు వెళ్లే వారు తమ వేలిముద్ర ఆధారంగా లోనికి వెళ్లి వ్యాయామం పూర్తైన తరువాత బయటకు వచ్చి తాళం వేసి వెళ్లిపోవచ్చు.
24 గంటలు అందుబాటులో ఉంచుతున్నాం..
కొందరు వ్యక్తిగత శిక్షకుల్ని నియమించుకుని శరీరంలోని ఏ భాగం ఎలాంటి ఆకృతి రావాలని కోరుకుంటున్నారో అందుకు అవసరమైన శిక్షణ పొందుతున్నారు. ఊబకాయం, ప్రత్యేకించి పొట్ట తగ్గించుకోవడానికి ప్రత్యేక శిక్షణ పొందుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా 40ఏళ్లు దాటిన తరువాత కూడా జిమ్‌లలో చేరి సాధన మొదలు పెడుతున్నారు. ఇలాంటి వారికోసం 24 గంటలు శిక్షణ ఇస్తున్నాం.
- ఎల్.మోహనరావు, జిమ్ యజమాని
గంటపాటు వ్యాయామం చేస్తే చాలు..
అర్ధరాత్రిళ్లు కూడా చక్కగా వ్యాయామాలు చేసుకోవచ్చు. తెల్లవారుజాము రెండు గంటలకు షిఫ్టు దిగి నేరుగా జిమ్‌కు వచ్చి ఒక గంటపాటు వ్యాయామం చేసుకునేవారు పెరుగుతున్నారు. రాత్రి పది దాటిన తర్వాత ఏదో ఒక సమయంలో కనీసం గంటపాటు వ్యాయామం చేస్తే అనారోగ్యాల బారిన పడకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.