జులై 1వ తేదీన ఆంధ్రా-ఒడిశా బోర్డర్ ప్రత్యేక జోనల్ కమిటీ పరిధి ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నట్లు ఏవోబీ ఎస్‌జడ్‌సీ కార్యదర్శి గణేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు. జూన్ 16వ తేదీ ఉదయం 9.30 గం.లకు తీగలమెట్ట గ్రామానికి దూరంగా అడవిలో మావోయిస్టులు మకాం వేసి ఉన్న ప్రాంతానికి ద్రోహులు ఇచ్చిన సమాచారంతో పోలీసు బలగాలు చుట్టుముట్టి దాడి చేశారని గణేష్ ఆరోపించారు. ఈ దాడిలో వీరోచితంగా పోలీసులను ప్రతిఘటిస్తూ ఎంకేవీబీ డివిజన్ కమిటీ సభ్యుడు రణదేవ్, మరొక డివిజన్ కమిటీ సభ్యుడు అశోక్ అలియాస్ గంగయ్య, ఏరియా కమిటీ సభ్యురాలు కడితి పాయికే, మడకం అంజన్న, మడకం పాయికే, లలితలు అమరులయ్యారని తెలిపారు. వారికి విప్లవ జోహార్లను ఏవోబీ తరుపున గణేష్ ప్రకటించారు.
దేశంలోనూ రాష్ట్రంలోనూ ఒక వైపు కరోనా సమస్యలతో ప్రజలు జనజీవనం అల్లకల్లోలంలో ఉన్న పరిస్థితులలో మావోయిస్టు పార్టీ ప్రజల కోసం వైద్యం, ఆహారం అందించడం వంటి కార్యక్రమాలను ప్రధానంగా చేస్తున్నామని.. ఎటువంటి ప్రతిఘటన చర్యలను చేపట్టలేదని గణేష్ తెలిపారు. కానీ ఆదివాసీ ప్రాంతంలో ప్రభుత్వం కనీసం వైద్యం అందించడం కాదు కదా కరోనా టెస్టింగ్ కూడా చేయలేదని.. ఇంతవరకూ మన్యంలో ఏ ఒక్క డాక్టర్ కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చుతో వందలాది పోలీసులు బలగాలను ఆదివాసి ప్రాంతంలోకి ప్రభుత్వం పంపిస్తుందని మండిపడ్డారు.