తండ్రి ప్రాణం దక్కించుకోవాలని శతవిధాల ప్రయత్నించాడు. ఆస్పత్రిలో ఇతరులకు అనుమతి లేకపోవడంతో ఏకంగా స్వీపరులా మారాడు. నాన్నను దగ్గరుండి చూసుకోవచ్చని అతని ఆశలు అడియాసలే అయ్యాయి. తండ్రిని విగతజీవిలా చూసి కన్నీరుమున్నీరయ్యాడు. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలో జరిగింది.
అక్కయ్యపాలేనికి చెందిన ఎ.మధుకిషన్ ఎంబీఏ చదివారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 1902 స్పందన కాల్‌సెంటర్‌లో ఏడాదిన్నరగా పని చేస్తున్నారు. మధుకిషన్ తండ్రి సుదర్శనరావు (67) విశ్రాంత షిప్‌యార్డు ఉద్యోగి. ఆయన కొవిడ్ బారిన పడడంతో ఈనెల 2న కేజీహెచ్‌లో చేర్పించారు. సీఎస్‌ఆర్ బ్లాక్ నాలుగో అంతస్తులోని ఐసీయూ పడకలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల తరువాత సుదర్శనరావు స్నానాల గదిలో పడిపోవడంతో దెబ్బతగిలి రక్తం బాగా కారిపోయింది. సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని ఆయన తన కుమారులకు ఫోన్ చేసి చెప్పారు. వారు కేజీహెచ్ సూపరింటెండెంట్, వైద్యులకు ఫిర్యాదు చేయడంతో దెబ్బలకు చికిత్స చేశారు. అయితే అక్కడున్న సిబ్బంది తండ్రిని పట్టించుకోవడం లేదని మధుకిషన్‌కు తెలిసింది. తండ్రి ఆరోగ్యం కుదుటపడే వరకు ఆయన దగ్గర ఉండాలని అనుకున్నా బయటవారిని అనుమతించరని తెలిసి పారిశుద్ధ్య కార్మికుడిగా సోమవారం మధ్యాహ్నం ఆసుపత్రిలో చేరారు. రాత్రి 9.30 గంటలకు విధులకు వెళ్లారు. తండ్రి చికిత్స పొందుతున్న పడక వద్దకు వెళ్లి చూడగా కనిపించలేదు. మరుగుదొడ్డి గది వరండాలో పడిపోయి ఉన్నారు. ఆ దృశ్యం చూసి నిశ్చేష్టుడైౖ పోయారు మధుకిషన్. అదే వార్డులో ఉన్న ఓ వ్యక్తి వచ్చి ఆయన ఎప్పుడో చనిపోయాడని చెప్పడంతో బోరున విలపించారు.