Kodi Katthi Case Latest Updates: విశాఖపట్నం ఎన్‌ఐఏ కోర్టులో బుధవారం నాడు కోడి కత్తి కేసు విచారణ జరిగింది. విచారణలో భాగంగా న్యాయవాదుల వాదోపవాదాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. అలాగే, నిందితుడు శ్రీనివాసరావును విశాఖ సెంట్రల్ జైలుకు తరలించాలన్న ఎన్‌ఐఏ అభ్యర్థనను కోర్టు అంగీకరించింది.
Advocate Salim Comments: విచారణ అనంతరం నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాదులు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్.. కోడి కత్తి కేసు విచారణకు హాజరుకాకుండా విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. నాలుగున్నరేళ్ల నుంచి సీఎం జగన్.. శ్రీనివాసరావుని తన తల్లికి దూరం చేశారని ఆగ్రహించారు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో ఎన్‌వోసీ (NOC) అయినా ఇవ్వాలని న్యాయవాదులు కోరారు.
నేను కోర్టుకు హాజరైతే.. ట్రాఫిక్ ఇబ్బందులొస్తాయి: కోడి కత్తి కేసులో జగన్ పిటిషన్
''జగన్‌పై కోడి కత్తితో చేసినట్లు ఏ సాక్షి చెప్పలేదు. సాక్షులుగా ఉన్నవాళ్లు కూడా కత్తితో దాడిచేసినట్లు చూడలేదన్నారు. ఈ కేసులో మజ్జి శ్రీనే అన్ని అయి ఉన్నాడు. మజ్జి శ్రీను తన ఫోన్ విచారణ అధికారులకు ఎందుకు డిపాజిట్ చేయలేదు..?. మావద్ద అన్ని ఆధారాలున్నాయి. సమయం వచ్చినప్పుడు అందిస్తాం. హరీశ్‌సాల్వే పెళ్లికి జగన్ లండన్ వెళ్లారు. కుమార్తెపై ప్రేమతో సీఎం జగన్ వేల కిలోమీటర్లు వెళ్లారు. కానీ, రాష్ట్రంలో ఉన్న విశాఖకు రాలేరా..?. ఒక ఎస్సీ బిడ్డను నాలుగున్నరేళ్లుగా మగ్గిపోయేలా చేస్తున్నారు. పెళ్లికి వీడియోలో శుభాకాంక్షలు చెప్పి, కోర్టుకు హాజరు కావొచ్చు కదా..?. జనుపల్లి శ్రీనివాస్ ఫుడ్ కోర్టులో అనుమతితోనే పనిచేస్తున్నారు. ఐదుగురు వైసీపీ నేతలు పాస్ లేకుండానే ప్రవేశించిన విషయం కోర్టు ముందుంచుతున్నా. ఆరోజు పోలీస్ స్ట్రైకింగ్ ఫోర్స్ జీపుపై వైసీపీ నేతలు దాడి చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు..?'' -సలీం, నిందితుడి తరఫు న్యాయవాది