ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉదయాన్నే పొగమంచు చుట్టుముడుతోంది. ఈ క్రమంలో తూర్పు కోస్తా రైల్వే పలు రక్షణ చర్యలు చేపడుతోంది. రైలు ప్రయాణాలు, సరకు రవాణా సురక్షితంగా సాగేలా ఏర్పాట్లు చేస్తోంది. జనవరి, ఫిబ్రవరి వరకు అవసరమున్నన్నాళ్లూ ఈ చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక రచించింది.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిశాలో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండే సెక్షన్లను అప్రమత్తం చేసింది తూర్పు కోస్తా రైల్వే. ప్రతి స్టేషన్ పరిధిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు, ఎక్కువ పొగమంచు ఎప్పుడెప్పుడు నమోదయ్యాయో రికార్డులు బయటికి తీస్తోంది. వాటి ఆధారంగా ఆయా ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. వీరికి ప్రత్యేక శిక్షణనూ ఇచ్చారు.
- రాత్రి సమయాల్లో పట్టాల నిఘాను పెంచినట్లు వాల్తేరు డివిజన్ అధికారులు వెల్లడించారు. సిబ్బందికి జీపీఎస్ పరికరాల్నీ అందించారు. విజయవాడ, భువనేశ్వర్, అరకు వైపుగా వెళ్లే రైలు మార్గాల్లో పొగమంచు తీవ్రత ఉన్నచోట్ల అర్ధరాత్రి నుంచి ఉదయం 7గంటల వరకు పహారా పకడ్బందీగా ఉండేలా చూస్తున్నారు.
- ఎండ పెరిగే వరకూ పొగమంచులో చూపు సామర్థ్యం(విజిబులిటీ) బట్టి రైలు వేగాన్ని నియంత్రించుకునేలా లోకో పైలెట్లకు ఆదేశాలు వెళ్లాయి. స్థానిక పరిస్థితుల్ని బట్టి వారే నిర్ణయం తీసుకునేలా జాగ్రత్తలు చెబుతున్నారు. ఈ కారణంగానే ఉత్తరాది నుంచి కొన్ని రైళ్లు ఆలస్యంగా వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
- రోడ్లు, ఊర్లకు సమీపాల్లో రైలు పట్టాలున్న చోట్ల పలువురు ఆకస్మికంగా పట్టాలు దాటే ప్రమాదం ఉండొచ్చు. అలాంటి చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా రైళ్లకు ఎల్‌ఈడీ లైట్లను పెంచుతున్నట్లు వాల్తేరు అధికారులు తెలిపారు. ఇంజిన్ మీదున్న ఓవర్‌హెడ్ పరికరాలకు(ఓహెచ్‌ఈ) ప్రకాశమంతమైన స్కిక్కర్లను అంటిస్తున్నట్లూ ప్రకటించారు. ప్రమాదాలు జరిగే అవకాశమున్నచోట్ల హారన్, విజిల్ వేస్తూ వెళ్లమని లోకో పైలెట్లకు, గార్డులకు చెప్పారు.
అత్యవసరమైతే.. వాడే సాధనాలివే..
డిటోనేటర్లు: ఎక్కడైనా పట్టాలు విరగడం, దెబ్బతినడం లాంటి వాటిని రైల్వే సిబ్బంది చూసినా.... పొగ మంచులో రైళ్లను ఆపడం కష్టం. ఈ సమయంలో ప్రమాద స్థలానికి రెండు వైపులా అర కిలో మీటరు ముందుగా పట్టాలకు డిటోనేటర్లను (చిన్న టపాసు) కట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. దీని మీద నుంచి రైలు వెళ్లగానే ‘టప్’ మని శబ్దం వస్తుంది. అప్పుడు లోకో పైలెట్ అప్రమత్తమై రైలు ఆపేలా చూస్తున్నారు.