తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఉభయ జిల్లాల్లో కాలుష్యం పలు కారణాలతో అధికంగా నమోదవుతోంది. శ్వాసకోశ సంబంధ రోగాలతో బాధపడేవారి సంఖ్య ఇతర జిల్లాలతో పోల్చిచూస్తే అధికం. ఏటా వేల సంఖ్యలో పశువులు మృత్యువాత పడుతున్నాయి. వందల ఎకరాల్లో పంట పొలాలు నాశనమవుతున్నాయి. అయినా నివారణ చర్యలు కంటితుడుపుగా మిగులుతున్నాయి. పరిస్థితిని పరిశీలిస్తే..
పరిశ్రమలు..:పాల్వంచలో నాలుగైదు భారీ పరిశ్రమలు, పదుల సంఖ్య చిన్నతరహా పరిశ్రమలున్నాయి. ఉత్పత్తుల తయారీలో, షట్‌డౌన్ సమయాల్లో పరిశ్రమల గొట్టాల నుంచి దట్టమైన పొగ వస్తోంది. ఆ సమయంలో గాలివాటం ఎటు వైపు ఉంటే అటు బూడిద, ఇతర రసాయనాలు వాతావరణంలో వెదజల్లుతున్నాయి. విద్యుత్తు ఉత్పత్తి సంస్థ కారణంగా పాల్వంచ, మణుగూరు మండలాల్లో పదుల సంఖ్యలోని గ్రామాల్లో వందల ఎకరాల పొలాలు సాగు యోగ్యతకు నోచుకోవడంలేదు.
చెత్త కాల్చివేత..:కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, పాల్వంచ, సత్తుపల్లి, మధిర పురపాలికల పరిధిలో ఇంటింటికీ చెత్త సేకరణ మొక్కుబడిగా సాగుతోంది. ఖాళీ ప్రదేశాల్లో గుట్టలుగా పేరుకుపోయే వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారు. ఘన వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్లు ఖమ్మం, కొత్తగూడెంలో మాత్రమే ఉండగా.. అవీ పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. నగర/పురపాలకాల్లో రోజుకు 238 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా ఇందులో సుమారు 40 మె.ట. కాల్చివేస్తున్నారు.
పాత వాహనాలు..:కాల పరిమితి ముగిసిన వాహనాలు పొగ బండ్లుగా మారినా పట్టణాల్లో యథేచ్ఛగా నడుపుతున్నారు. కాలం చెల్లిన వాటిల్లో గత మూడేళ్లలో 2,148 ద్విచక్రవాహనాలు, 574 ఆటోలు, 51 కార్లు, 69 ట్రాక్టర్లు, 37 బస్సులు, 82 లారీలను స్వాధీనం చేసుకున్నారు.
బొగ్గు గనులు..:సింగరేణి ఓసీ పేలుళ్లు, బొగ్గు రవాణా కారణంగా సత్తుపల్లి, ఇల్లెందు, టేకులపల్లి, కొత్తగూడెం, మణుగూరుల్లో దుమ్ము, ధూళి ఎగసిపడుతోంది. గనుల్లో వెలువడే ధార్మికశక్తితో పరివాహక ప్రాంతాల వారికి చర్మవ్యాధులు, ప్రాణాంతక క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది.
అధ్వాన రహదారులు..:ఖమ్మం-ఇల్లెందు, ఖమ్మం-నేలకొండపల్లి, కొత్తగూడెం-ఇల్లెందు, కొత్తగూడెం-ఖమ్మం, పాల్వంచ-సత్తుపల్లి సహా జిల్లా మీదుగా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారులు పలు చోట్ల గుంతలమయంగా మారాయి. నిత్యం దుమ్ము, ధూళి ఎగిసిపడుతోంది. పీఆర్, ఇతర రోడ్లదీ ఇదే పరిస్థితి. ఖమ్మం, కొత్తగూడెం మినహా మిగతా పట్టణాల్లో దుమ్ము శుభ్రం చేసే యంత్రాలు అందుబాటులో లేవు.
నియంత్రణ చర్యలు..