ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం

భారీ వర్షాలకు విశాఖ అతలాకుతలమైంది. అల్పపీడన ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్లు, రోడ్లపైకి నీరు చేరటంతో జనజీవనం స్తంభించింది. రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంగణాలన్నీ జలమయమయ్యాయి.

విశాఖలో భారీ వర్షాలు

By

Published : Oct 23, 2019, 3:24 PM IST

విశాఖలో భారీ వర్షాలు

భారీగా కురుస్తున్న వర్షాలకు విశాఖ జిల్లా వణుకుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం విశాఖ గ్రామీణ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండు రోజుల్లో చోడవరంలో అధిక వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొన్నిచోట్ల వర్షపునీరు ఇళ్లలోకి ప్రవేశించింది. విశాఖ మన్యంలోని 11 మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు నీటితో నిండిపోయాయి.

పెరిగిన నీటిమట్టం
వర్షాలకు రావికమతం మండలం కల్యాణపులోవ జలాశయంలో నీటిమట్టం పెరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా... ప్రస్తుతం 358 అడుగులకు నీటిమట్టం చేరింది. అధికారులు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. విశాఖ రైల్వేస్టేషన్ సమీపంలోని కాన్వెంట్ జంక్షన్ వద్ద ఉన్న వంతెన కిందకు భారీగా వర్షపు నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఉద్యోగులు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనకాపల్లి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో భారీగా నీరు చేరింది. ప్రయాణికులు కూర్చున్న చోటుకు నీరు చేరటంతో వారు అసౌకర్యానికి గురయ్యారు. కాంప్లెక్సులోని దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది.

విశాఖలో భారీ వర్షాలు

స్తంభించిన జనజీవనం
గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షానికి విశాఖలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. విశాఖ జిల్లాలో పాఠశాలలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. కలెక్టరేట్​లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి అన్ని మండలాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని... లోతట్టు ప్రాంత ప్రజలను ముందుగా హెచ్చరించాలని ఆదేశించారు. బుచ్చయ్యపేట మండలం పెదపూడి శివారు సూర్య లక్ష్మీనగర్ వద్ద కల్వర్టు కొట్టుకుపోయి రాకపోకలు స్తంభించాయి.

కూలిన ఇళ్లు
ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి సమీపంలో వర్షాలకు పాత భవనం కూలింది. ఈ ఘటనలో రెండు మోటార్ బైక్​లు నుజ్జునుజ్జు అయ్యాయి. సింహాచలంలో ప్రవహిస్తున్న జలధారలతో సింహగిరుల మెట్ల మార్గాలన్నీ జలమయమయ్యాయి. మాకవరపాలెంలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. సింధియాలోని 47వ వార్డులో కొత్తనక్కవాని పాలెంలో పిల్లల దేముడు అనే వ్యక్తి ఇంటిగోడ కూలింది.

ఇవీ చదవండి.

కొనసాగుతున్న మృతదేహాల గుర్తింపు ప్రక్రియ

ABOUT THE AUTHOR

...view details