ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'యాత్ర ఫర్‌ ఛేంజ్‌' నినాదంతో కాంగ్రెస్ పాదయాత్ర​.. ఎప్పటినుంచంటే..?

Hathse Hath Jodo Abhiyan Yatra: ప్రజా సమస్యలు ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా పాదయాత్రకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. 'హాత్‌సే హాత్ జోడో అభియాన్' పేరుతో దేశవ్యాప్తంగా చేపట్టనున్న పాదయాత్రలను తెలంగాణ రాష్ట్రంలో జూన్‌ వరకూ కొనసాగించాలని యోచిస్తోంది. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Pcc Revanth reddy
జనవరి 26 నుంచి కాంగ్రెస్ పాదయాత్ర

By

Published : Dec 29, 2022, 4:41 PM IST

జనవరి 26 నుంచి కాంగ్రెస్ పాదయాత్ర షురూ

Hathse Hath Jodo Abhiyan Yatra: తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రల సీజన్‌ నడుస్తుంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు షర్మిల యాత్రలు చేపడుతుండగా.. తాజాగా ఆ జాబితాలోకి కాంగ్రెస్‌ చేరింది. దేశవ్యాప్తంగా జనవరి 26 నుంచి రెండు నెలల పాటు చేపట్టే "హాత్‌సే హాత్‌ జోడో" యాత్రను రాష్ట్రంలో జూన్‌ వరకూ కొనసాగించి పార్టీని బలపరచాలని పీసీసీ యోచిస్తుంది. దానికి అనుగుణంగా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగే ఈ పాదయాత్రలో స్థానిక సమస్యలను ఎత్తిచూపుతూ ప్రజల మద్దతును కూడగట్టాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న ఈ యాత్రను 'యాత్ర ఫర్‌ ఛేంజ్‌' అన్న నినాదంతో జనంలోకి వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. రాబోయే ఎన్నికల్లో డజన్‌కుపైగా పార్టీలు పోటీ చేసే అవకాశం ఉండటంతో ఓట్లు భారీగా చీలే అవకాశం ఉంది.

అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తమ ఖాతాలో వేసుకుంటే కాంగ్రెస్‌ గెలుపు నల్లేరుపై నడకేనని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా అంతర్గత కుమ్ములాటలకు మారు పేరైన కాంగ్రెస్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు హైకమాండ్‌కు తలనొప్పిగా మారాయి. దీంతో అధిష్ఠానం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర పీసీసీ కమిటీల్లో అనర్హులను తప్పించి అర్హులకు పదవులివ్వాలని, పీసీసీ వ్యతిరేకవర్గ సీనియర్లు కోరుతున్నప్పటికీ మధ్యేమార్గమే మేలని అధిష్ఠానం యోచిస్తోంది.

అయితే, రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ముఖ్యనాయకుల సిఫారసులతోనే ప్రస్తుత కమిటీ ఏర్పాటు జరిగింది. ఆ కారణంగానే కమిటీలో ఎవరినీ తొలగించకూడదని ఏఐసీసీ నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా ఉన్న తమకు పదవులు దక్కలేదని పలువురు నాయకులు ఏకరువుపెట్టడంతో.. అర్హులైన కొందరికి కమిటీల్లో చోటు కల్పించాలని ఏఐసీసీ భావిస్తోంది. అంతేకాకుండా కుటుంబంలో ఒక్కరికే పదవి అన్న నిబంధనతో ఆగిన.. సికింద్రాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి డీసీసీ పదవులతో పాటు మొత్తం 7 జిల్లాలకు అధ్యక్షుల నియామకం త్వరలో జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details