కాళ్లకు పారాణి అరలేదు. అప్పుడే వరకట్నానికి ఓ ప్రభుత్వ ఉద్యోగిని బలైంది. తల్లిదండ్రులకు విషయం చెప్పలేక.. తనలో తానే కుమిలిపోయి ఆత్మహత్య చేసుకుంది.
అదనపు కట్నం... తీసింది ఉద్యోగిని ప్రాణం! - విశాఖలో వరకట్న వేధింపులకు మహిళ ఆత్మహత్య న్యూస్
భర్త చదువుకుని సంపాదిస్తున్న వాడే అయినా.. డబ్బుపై వ్యామోహం. మరోవైపు అదనపు కట్నం తేవాల్సిందిగా.. అత్త ఈసడింపు. చివరకు ప్రభుత్వ ఉద్యోగిని ప్రాణాలు బలి తీసుకుంది. పెళ్లైన ఆరు నెలలకే.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
విశాఖ జిల్లా మునగపాక గ్రామానికి చెందిన పెంటకోట దివ్యకు అనకాపల్లికి చెందిన బుద్ధ చైతన్యతో 2019 మే 18న వివాహం జరిగింది. కట్నం కింద డబ్బు, బంగారం ముట్టజెప్పారు. దివ్య విశాఖ జిల్లా ముంచింగిపుట్టు మండలంలో వ్యవసాయ విస్తరణ అధికారిగా పని చేసేది. ఆమె భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్. కొన్ని రోజులుగా.. దివ్యను భర్త, అత్త వరకట్నం కోసం వేధిస్తున్నట్లు మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. తమ కుమార్తెను కొట్టి పుట్టింటికి పంపారని.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు వారు తెలిపారు. సూసైడ్ నోటును పోలీసులకు అందజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.