విశాఖలోని ఎండాడ వద్ద రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు 57.53 ఎకరాల భూమి ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2007లో ఏర్పాటుచేసిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు దీన్ని కేటాయించారు. పూర్తిగా కొండ ప్రాంతమైన ఈ భూమిని చదును చేసి, మధ్య తరగతి ప్రజలకు రెండు, మూడు పడక గదుల అపార్టుమెంట్లు నిర్మించి ఇస్తామని ‘ఆద్రజ’ అనే పేరిట నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రజల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి కొంత రుసుం వసూలు చేశారు. ఆకర్షనీయ ప్రాజెక్టు కావడంతో అప్పట్లో వేల మంది దరఖాస్తులు చేశారు. వివిధ కారణాలతో ప్రాజెక్టు మధ్యలోనే నిలిచిపోయింది. దరఖాస్తుదారుల సొమ్మును సైతం వెనక్కి ఇచ్చేయడం ప్రారంభించారు. చాలామందికి విషయం తెలియక, మరికొందరు మళ్లీ అవకాశం ఉంటుందనే ఆశతో డబ్బులను వెెనక్కి తీసుకోలేదు. ప్రాజెక్టు మరోసారి పట్టాలెక్కుతుందనే ఆశతో 15 ఏళ్లుగా కొందరు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. తాము గతంలోనే దరఖాస్తు చేసుకున్నామని, ఇక్కడ తమకే అవకాశం కల్పించాలని డిమాండు చేస్తున్నారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు.
కొండ ప్రాంతంలోని 57 ఎకరాలలో కొంతమేరకు అప్పట్లో చదును చేశారు. ప్రాజెక్టు నిలిచిపోయాక... కొన్ని అసంపూర్తి కట్టడాలు, నమూనా భవనాలు, కొన్ని పునాదుల స్థాయి నిర్మాణాలు మిగిలాయి. అవికాకుండా చాలాప్రాంతం గోతులతో ఉంది. ప్రస్తుతం వాటిని పూడ్చుతున్నారు. ఈ మొత్తం ప్రాంతమంతటినీ లేఅవుట్‌గా మార్చనున్నట్లు తెలుస్తోంది. ఈ పనుల కోసం ప్రాథమికంగా జీవీఎంసీ నిధులను ఖర్చు చేస్తున్నారు.