Government Offices in Millennium Towers: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక విశాఖలో అత్యంత విలువైన భూముల్ని అవకాశం ఉన్న చోటల్లా అధికార పార్టీ ముఖ్య నేతలు, వారి బినామీలు స్వాహా చేసేశారు. దోచుకోవడానికి అవకాశం లేని భూముల్ని ప్రభుత్వం తనఖా పెట్టి సుమారు 25 వేల కోట్ల అప్పులు తెచ్చింది. ప్రభుత్వ విధ్వంసక విధానాలతో ఇప్పటికే HSBC వంటి ఐటీ సంస్థలు విశాఖను వదిలి వెళ్లిపోగా.. మరికొన్ని సంస్థల్ని ప్రభుత్వమే వెళ్లగొట్టింది. అన్నీ వెళ్లిపోయాక ఇంకా ఏం మిగిలిందని.. సీఎం, మంత్రులు విశాఖకు వెళ్లాలనుకుంటున్నారో వారే చెప్పాలి.
AP Government Departments in Visakhapatnam :విశాఖలో ఐటీ రంగం అభివృద్ధిని ప్రోత్సహించేందుకు నిర్మించిన మిలీనియం టవర్స్ (Millennium Towers)లో చాలా భాగాన్ని.. రాజధానిని అక్కడికి తరలించే దురుద్దేశంతోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇన్నేళ్లూ ఖాళీగా పెట్టింది. దానిని ఇప్పుడు తమ సమీక్షలకు ఉపయోగించుకునేందుకు వాటి వాడుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల్ని కల్పించే లక్ష్యంతో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో.. మిలీనియం టవర్స్ నిర్మాణం తలపెట్టారు. రెండు టవర్లకు అప్పుడే నిధుల కేటాయింపు జరగ్గా... ఒక టవర్ నిర్మాణం పూర్తైంది. అందులో నాలుగు అంతస్తుల్ని ఐటీ కంపెనీ కాండ్యుయెంట్‌కు లీజుకిచ్చారు.
CM Camp Office Shifting to Visakhapatnam : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రెండో టవర్ నిర్మాణం పూర్తి చేసింది. కానీ అప్పటికే రాజధానిని విశాఖకు మార్చాలన్న దురుద్దేశం ఉండటంతో.. మిలీనియం టవర్స్‌ను ఐటీ కంపెనీలకు ఇవ్వకుండా ఖాళీగా ఉంచింది. విస్తరణ కోసం 'టవర్-ఎ'లో మిగతా అంతస్తుల్ని తమకివ్వాలని కాండ్యుయెంట్ కోరినా ససేమిరా అంది. ఎ, బి టవర్స్‌లో మొత్తంగా 4 లక్షల చదరపు అడుగుల వరకు నిర్మిత ప్రాంతం అందుబాటులో ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో ఐటీ కంపెనీలకు కేటాయిస్తే.. మూడు షిఫ్టుల్లో కలిపి 12 వేల మందికి ఉపాధి లభించేదని, అదే బీపీఓ కంపెనీలైతే 24 వేల మందికి ఉపాధి దొరికేదని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. వారి వల్ల పరోక్షంగా మరో లక్షమందికైనా ఉపాధి లభించేది. కానీ ఈ టవర్స్‌లోని 1.75 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఇప్పుడు ప్రభుత్వం తీసుకోనుంది.
కల్లబొల్లి కబుర్లు.. హైకోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించే వైనం : సీఎం జగన్ వివిధ ప్రభుత్వ శాఖలపై ఒక నెలలో నిర్వహించే సమీక్షలు పట్టుమని పది కూడా ఉండవు. పైగా ఒకేరోజు రెండు శాఖలపై సమీక్షించిన సందర్భాలు చాలా అరుదు. ఆయన ఒక శాఖపై సమీక్షిస్తుంటే.. దానికి సంబంధించిన మంత్రి, కార్యదర్శి, విభాగాధిపతులు, ఇతర అధికారులు ఓ అయిదారుగురు లేదా మహా అయితే పదిమంది హాజరవుతారు. ఆ మాత్రం దానికి విశాఖలో మొత్తం మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులందరికీ క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరమేంటో తెలియని పరిస్థితి. నలుగురైదుగురు సిబ్బందితో నడిచేక్యాంప్ కార్యాలయాలకు కొన్ని లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన భవనాలెందుకో? పైగా సీఎం ఉత్తరాంధ్రలో మకాం పెట్టబోతున్నదీ, మంత్రులు, అధికారులు అక్కడికి వెళ్లబోతున్నదీ.
Millennium Towers in Visakhapatnam :ఉత్తరాంధ్ర అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకేనని ప్రభుత్వం చెబుతోంది. అందుకోసం మొత్తం మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌ఓడీల కార్యాలయాల్ని విశాఖకు తరలించాల్సిన అవసరమేంటో వారే సెలవివ్వాలి. సీఎం ఏ శాఖపై సమీక్షిస్తే ఆ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు, ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, స్థానిక అధికారులు హాజరైతే సరిపోతుంది. కానీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై కల్లబొల్లి కబుర్లు చెబుతూ.. హైకోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించి కుట్రపూరితంగా రాజధానిని విశాఖకు తరలించబోతోందని దీన్నిబట్టి స్పష్టంగా అర్థమవుతోంది.