నాటు తుపాకీలు తయారు చేస్తూ, వాటిని విక్రయిస్తున్న నలుగురిని విశాఖ జిల్లా కె.కోటపాడు పోలీసులు అరెస్టు చేశారు. వారికి సహకరిస్తున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కచ్చితమైన సమాచారం మేరకు కె.సంతపాలెంలో పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపారు. ఈ గ్రామానికి చెందిన ర్యాలి అప్పలనర్సయ్య, బల్లంకి సత్యనారాయణ, దేవరాపల్లికి చెందిన పాలవలస శంకరరావు, విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన మండా అప్పారావు మొత్తం నలుగురు తుపాకులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
ఈ కేసులో మొత్తం ఆరుగురిపై కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించినట్లు కె.కోటపాడు ఎస్సై నారాయణరావు చెప్పారు. సంఘటన స్థలంలో 11 నాటుతుపాకులు, వాటి తయారీకి ఉపయోగించే సామాగ్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్క నాటుతుపాకి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారని విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.