విత్తన కేంద్రాల వద్ద కర్షకుల పడిగాపులు - seeds
విశాఖపట్నం జిల్లా రైతులు విత్తనాల కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం రాయితీ విత్తనాలను అరకొరగా సరఫరా చేస్తోందని ఆందోళన చేపట్టారు. ముందస్తు అంచనాలు పంపినా.. విత్తనాలు తక్కువగా వచ్చాయంటున్న అధికారులు రెండు, మూడు రోజుల్లో కొరత తీరుస్తామని హామీ ఇస్తున్నారు.
అన్నదాతలు విత్తనాల కోసం ఎండకు ఎండి, వానకు తడుస్తూ వ్యవసాయశాఖ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సిఫార్సు ఉన్న వారికే విత్తనాలు సరఫరా చేస్తున్నారని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం తాజాగా సీపీఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. రోజుల తరబడి విత్తనాల కోసం పనులు మానుకుని తిరుగుతున్నామని బాధిత రైతులు పేర్కొంటున్నారు. విశాఖ ప్రాంతీయ వ్యవసాయశాఖ అధికారి నాగపద్మరావు మాట్లాడుతూ..ఆర్.జె.ఎల్ రకం విత్తనాలు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని, అవి ప్రస్తుతం గోదాంలో లేవని వెల్లడించారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.