ఇటీవల విస్తారంగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని దాదాపు అన్ని జలాశయాలు, వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీనితో పలు ప్రాంతాల్లోని చెరువులకు గండ్లు పడుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా నాతవరం మండలం బెన్నవరం సమీపంలోని రామరాజు చెరువుకు రెండు చోట్ల భారీ గండ్లు పడటంతో పంట పొలాలు నీటి ముంపునకు గురయ్యాయి.
రామరాజు చెరువుకు గండ్లు..నీటి వృథా
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలు, నదులు, కాలువలు... జలకళను సంతరించుకున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాలలో నీటి ఉద్ధృతి అధికంగా ఉండటంతో చెరువులకు గండ్లు పడుతున్నాయి. దీంతో వందల ఎకరాల్లోని పంట నీట మునిగిపోతోంది.
గండి పడిన చెరువు
నాతవరం, నర్సీపట్నం మండలాల్లో సుమారు రెండు వందల ఎకరాలకు సాగునీటిని అందించే ఈ చెరువు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిండుకుండలా మారింది. ఎగువనున్న ఉల్లిగడ్డ ప్రవాహం నుంచి అధికంగా నీరు వచ్చి చేరటంతో చెరువుకు రెండుచోట్ల గండ్లు పడ్డాయి. దీంతో నీరంతా వృథాగా పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండీ...వివరాలు సమగ్రంగా లేవు.. మళ్లీ పంపండి: హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం