విశాఖలో చెప్పుల దుకాణం నడిపేవాడ్ని. నాలుగేళ్ల క్రితం దాన్ని మూసేశా. ఇంటి అద్దె డబ్బులతోనే జీవనం సాగిస్తున్నాం. నాకు హజ్ యాత్ర చేయాలని ఉండేది. కానీ వయసు 65 సంవత్సరాలు. తోడు లేకుండా ఒక్కడివే అయితే ఇబ్బంది అని మిత్రులన్నారు. దీంతో 15 రోజుల ‘ఉమ్రా’ యాత్ర కోసం హైదరాబాద్ మీదుగా మక్కా, మదీనా వెళ్లాను. మార్చి 12న విశాఖ వచ్చా. మా అబ్బాయి అమెరికాలో వైద్యుడు. ‘14 రోజులు ఇంటిపట్టునే జాగ్రత్తగా ఉండాలి. కొవిడ్ - 19 లక్షణాలు లేకపోతే సరి. ఉంటే ఇబ్బంది అవ్వొచ్చు’ అని ఫోన్‌లో పదే పదే చెప్పేవాడు.
డాక్టర్ వచ్చి ఆ మాట చెప్పారు:
నాలో సహజంగానే ధైర్యం ఎక్కువ. ఆసుపత్రిలో చేరాక.. ‘మీకు కొవిడ్ - 19 ఉన్నట్లు నివేదిక వచ్చింది’ అని ఓ వైద్యుడు చెప్పారు. నేనైతే భయపడలేదు. ఈ వ్యాధి రాకముందే నేను సుమారు 4 సార్లు ఆసుపత్రిలో ఉండి ఇంటికొచ్చా. కాకపోతే ఒక బాధ ఉండేది. ఆసుపత్రిలో భోజనం తినలేకపోయేవాడ్ని. దీంతో నీరసం ఎక్కువయ్యేది. నాకు నచ్చినవి ఇమ్మని వైద్యుల్ని అడగలేను కదా. అది తప్పితే ఇంజక్షన్, మందులు అన్నీ సమయానికే అందేవి. వైద్యులు, సిబ్బంది నాకు అండగా నిలిచారు. చాలా బాగా చూశారు.
వెళ్తోంటే నా భార్య ఏడ్చేసింది:
14 రోజులు ఆసుపత్రిలో ఉన్నా. నాతో పాటు నా భార్య, కుమార్తెను కూడా తీసుకొచ్చారు. మా అమ్మాయికి ‘కొవిడ్ - 19’ లేదని ఇంటికి పంపేశారు. నా భార్యకు మాత్రం సోకింది. నాకు ‘నెగిటివ్’ వచ్చిందని వైద్యులు చెప్పిన తర్వాత మనసు కాస్త కుదుటపడింది. నేను ఇంటికొస్తుంటే నా భార్య బాగా ఏడ్చేసింది. తను కూడా రెండ్రోజుల్లో ఇంటికి వచ్చేస్తుందని వైద్యులు చెప్పారు.