ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బస్సులు తీసుకుంటున్నాం బడులకు సెలవివ్వండి.. జాబితాతో డీఈవోకు డీటీసీ లేఖ - బస్సులు తీసుకుంటున్నాం బడులకు సెలవివ్వండిని లేఖ

Buses for cm tour in vishaka: శాఖలో శుక్రవారం ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ సభకు ఆర్టీసీతో పాటు పెద్ద సంఖ్యలో ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేసి, లబ్ధిదారులను తరలించారు. ఈ నేపథ్యంలో ‘విద్యాసంస్థల బస్సులు తీసుకుంటున్నాం. అందువల్ల ఆ విద్యాలయాలకు శుక్రవారం సెలవు ఇవ్వండి’ అని జిల్లా రవాణాశాఖ ఉప కమిషనర్‌ (డీటీసీ) జి.సి.రాజారత్నం డీఈవోకు లేఖ రాయడం కలకలం రేపుతోంది.

educational institutions Buses taken for cm tour in vishaka
బస్సులు తీసుకుంటున్నాం బడులకు సెలవివ్వం

By

Published : Jul 16, 2022, 8:51 AM IST

Buses for cm tour in vishaka: విశాఖలో శుక్రవారం ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ సభకు ఆర్టీసీతో పాటు పెద్ద సంఖ్యలో ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేసి, లబ్ధిదారులను తరలించారు. ఈ నేపథ్యంలో ‘విద్యాసంస్థల బస్సులు తీసుకుంటున్నాం. అందువల్ల ఆ విద్యాలయాలకు శుక్రవారం సెలవు ఇవ్వండి’ అని జిల్లా రవాణాశాఖ ఉప కమిషనర్‌ (డీటీసీ) జి.సి.రాజారత్నం డీఈవోకు లేఖ రాయడం కలకలం రేపుతోంది. దాదాపు 34 విద్యాసంస్థల పేర్లను ప్రస్తావిస్తూ 13వ తేదీన రాసినట్లు ఉన్న ఆ లేఖ శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన నేపథ్యంలో డీఈవో ఆదేశాల మేరకు శుక్రవారం సెలవు ఇస్తున్నట్లు పలు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, ఆయా బస్సులను సభకు సమకూర్చాయి. ఎక్కువ బస్సులిచ్చిన విద్యాసంస్థలు ప్రత్యామ్నాయం లేక పూర్తిగా సెలవులిచ్చేశాయి. కొన్ని సంస్థలు అందుబాటులో ఉన్న కొద్ది బస్సులనే అదనంగా తిప్పి విద్యార్థులను తీసుకువచ్చి పాక్షికంగా తరగతులు నిర్వహించాయి. ఆ బస్సు డ్రైవర్లకు ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయలేదు.

వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను వినియోగించుకోవడం ఇటీవల కాలంలో ఎక్కువయింది. గతంలో లోపాయికారీగా ఆ తంతు జరిగేది. డీఈవోకు డీటీసీ రాసిన లేఖతో ఆ తతంగం అధికారికంగా మారినట్లయింది. ముఖ్యమంత్రి కార్యక్రమానికి బస్సుల కేటాయింపుతో విద్యాసంస్థల మూసివేయడంపై ‘ఈనాడు’ ప్రతినిధి ఫోన్లో ప్రయత్నించినా డీఈవో, డీటీసీ స్పందించలేదు.

జగన్‌ పర్యటన కోసం విద్యార్థులను చదువుకు దూరం చేస్తారా?: పట్టాభిరాం..సీఎం జగన్‌ పర్యటన కోసం విశాఖపట్నంలో 31 పాఠశాలలు, ఆరు కళాశాలలకు బలవంతంగా సెలవులివ్వడం దారుణమని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ధ్వజమెత్తారు. విద్యాసంస్థలను ఇష్టారీతిన మూయించే హక్కు ముఖ్యమంత్రికి, అధికారులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. సీఎం కార్యక్రమం కోసం ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలకు బస్సులు ఇవ్వాలని అధికారులు లిఖితపూర్వక ఆదేశాలివ్వడం దేశ చరిత్రలోనే తొలిసారని, ఇది అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.

‘ఒక్కో వాహన యజమాని నుంచి ఏడాదికి పెట్రోల్‌, డీజిల్‌ బాదుడుతో రూ.50 వేలు, జరిమానాల పేరుతో రూ.20 వేలు దోచుకుంటున్నారు. అధ్వాన రహదారులతో వాహనాలు దెబ్బతిని మరో రూ.30 వేలు ఖర్చవుతోంది. అంటే రూ.పది వేలు ఇస్తూ రూ.లక్ష దోచేస్తున్నారు’ అని పట్టాభిరాం విమర్శించారు.

విద్యార్థుల జీవితాలతో ఆటలా: వెలగపూడి..‘ముఖ్యమంత్రి వచ్చారని విద్యాసంస్థలకు సెలవులిచ్చిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. విద్యాసంస్థలు మూసేయాలని సిఫార్సు చేస్తూ డీటీసీ ఎలా అధికారిక ఉత్తర్వులిస్తారు? విద్యార్థుల జీవితాలతో అధికారులు ఆటలాడుకుంటున్నారు’ అని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మండిపడ్డారు.

ఇవీ చూడండి:గోదావరి మహోగ్రరూపం.. ముంపు బారిన 279 గ్రామాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details