Tribals Protest at Paderu ITDA: విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ వద్ద నిన్నటినుంచి గిరిజన సంఘం నాయకుల ధర్నా చేస్తున్నారు. అర్ధరాత్రి కూడా అక్కడే చలికి వణికిపోతూ.. నిరసనను కొనసాగించారు. మాతృభాషా విద్యా వాలంటీర్ల సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళన ఆపమని చెబుతున్నారు.
ఉద్రిక్తంగా మారిన ఐటీడీఏ ముట్టడి
మాతృ భాషా వాలంటీర్లు చేపట్టిన ఐటీడీఏ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఐటీడీఏ కార్యాలయం గేటు తోసుకొని లోపలకు వచ్చేందుకు యత్నించిన వాలంటీర్లపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. గిరిజన సంఘం, భాషా వాలంటీర్ల సంఘం సంయుక్తంగా సోమవారం విశాఖ జిల్లా పాడేరులో ర్యాలీగా ఐటీడీఏ కార్యాలయానికి చేరుకున్నాయి. లోపలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఐటీడీఏ పీఓ స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదంటూ బారికేడ్లను దాటుకుని గేటును తోసుకు వెళ్లేందుకు వాలంటీర్లు యత్నించడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. పది మంది వాలంటీర్లను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. సోమవారం రాత్రి 9గంటల వరకూ భాషా వాలంటీర్లు చలిలోనే ఉద్యమం కొనసాగించారు.
వేతన బకాయిలు చెల్లింపునకు చర్యలు
ఐటీడీఏ పీఓ గోపాలకృష్ణ అందుబాటులో లేకపోవడంతో గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయ్‌కుమార్ ఆందోళనకారులతో మాట్లాడారు. మూడు నెలల వేతన బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయం వారం క్రితమే పీఓ చెప్పారని, ఇప్పటికీ బ్యాంకు ఖాతాలకు వేతన బకాయిలు జమకాలేదని ఆందోళనకారులు పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో రెన్యువల్ చేస్తున్నట్లు హామీ పత్రం ఇచ్చే వరకు కదిలేది లేదని పట్టుబట్టారు. సమస్యలు పరిష్కారించాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వాలంటీర్లపై లాఠీఛార్జి చేయడం హేయమని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పల నర్సయ్య అన్నారు. ఆదివాసీ మాతృ భాషా విద్యావాలంటీర్లను రెన్యువల్ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం తగదన్నారు. ముందుగా సమాచారం ఇచ్చినా పీఓ అందుబాటులో లేరని.. ఆయన వైఖరిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.