స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా నేటికి మన్యంలోని మారుమూల గ్రామాలకు సరైన రహదారి సదుపాయం లేక గిరిపుత్రులు నానా అవస్థలు పడుతున్నారు. నిండు గర్భిణులకు పురుటి నొప్పులు వస్తే... డోలీమోతలు తప్పడం లేదు. విశాఖ జిల్లా సుల్తాన్పుట్ గ్రామంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని తరలించడానికి చాలా ప్రయాస పడాల్సివచ్చింది. ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం దక్కలేదు. ప్రసవించిన వెంటేనే మగబిడ్డ మరణించాడు. ఈ ఘటన ఆ తల్లికి కడపుకోతను మిగిల్చింది.
విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని బూసిపుట్ పంచాయతీ సుల్తాన్పుట్ గ్రామ ప్రజలకు డోలీ మోతలు తప్పడం లేదు. గ్రామానికి చెందిన పాంగిచెల్లామ్మ నిండు గర్భిణి. ఆమె గత మూడు రోజులుగా పురుటి నొప్పులతో బాధపడుతోంది. గురువారం నొప్పులు ఎక్కువ కావడంతో కుటుంబీకులు ఓ ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించాలనుకున్నారు. ఆ వాహనం కాస్త.. ఘాట్ రోడ్డున వెళ్తుంటే... బురదలో నిలిచిపోయింది. దీంతో చేసేదేం లేక కుటుంబీకులు కొంత దూరం డోలీమీద.. మరికొంత దూరం ఎత్తుకుని తీసుకెళ్లారు. ఆ మహిళ మూడు కిలోమీటర్ల మేర బంధువులు అతికష్టం మీద నడిపించుకుని తీసుకువెళ్లారు.