ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రసాదరెడ్డి - మరోసారి ఏయూ వీసీగా నియామకం

Andhra University VC Prasada Reddy: ఆంధ్ర యూనివర్శిటీ వీసీ పదవిని మరోసారి వైఎస్సార్సీపీ నేతగా పేరున్న ప్రసాదరెడ్డికే ప్రభుత్వం కట్టబెట్టింది. ఏయూ వీసీగా ఉన్న సమయంలో ఆయనపై ఆరోపణల చిట్టా చాంతాడం ఉంటుంది. ప్రసాదరెడ్డి అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులోనూ పిటిషన్‌ దాఖలైంది. అయినా రెండోసారి కూడా ఆయనకే వీసీ పదవికట్టబెట్టడం చర్చాంశనీయమైంది.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 18, 2024, 9:29 AM IST

Andhra_University_VC_Prasada_Reddy
Andhra_University_VC_Prasada_Reddy

Andhra University VC Prasada Reddy : ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీగా ప్రసాదరెడ్డిని రెండోసారి ప్రభుత్వం నియమించింది. ప్రజాసంఘాలు, విద్యారంగ నిపుణులు ప్రసాదరెడ్డి పని తీరును తీవ్రంగా విమర్శిస్తున్నా, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా బరితెగించి మరీ ప్రభుత్వం ఆయన్నే వీసీగా మరోసారి నియమించింది. వైఎస్సార్సీపీలోని కీలక నేతలతో ప్రసాదరెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఆయన వ్యవహరిస్తుంటారు.

గతంలో జరిగిన ఎన్నికల్లో ప్రసాదరెడ్డి వైఎస్సార్సీపీ కోసం ఏయూ కేంద్రంగా సర్వేలు నిర్వహించారు. ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయాన్ని పార్టీ కార్యకలాపాలకు వేదికగా మార్చిన అపఖ్యాతిని మూటగట్టుకున్న ఆయనే మరో మూడేళ్ల పాటు వీసీగా ప్రభుత్వం అందలం ఎక్కించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గతంలో మాదిరిగానే సర్వేలు, వైఎస్సార్సీపీ అనుకూల ప్రచారం చేయించుకునేందుకే ప్రసాదరెడ్డిని మరోసారి వీసీగా నియమించారని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారం అండగా వివాదాస్పద నిర్ణయాలు - ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై విద్యార్థి సంఘాల ప్రజాప్రయోజన వ్యాజ్యం

వైస్ ఛాన్సలర్​గా పనిచేసిన సమయంలో ప్రసాదరెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని రాజకీయ వేదికగా మార్చేశారు. గతంలో ఉపకులపతులుగా పని చేసిన వారికీ రాజకీయ నేపథ్యం ఉన్నా అందులో నేరుగా పాల్గొనే వారు కాదు. పాలనా వ్యవహారాల్లోనూ ఎంతమాత్రం చోటిచ్చేవారు కాదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వీసీగా బాధ్యతలు చేపట్టిన ప్రసాదరెడ్డి విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరించారు. విశాఖలో సొంత సామాజికవర్గం వారితో సమావేశాలు నిర్వహించడం, అందులో ఆయనే క్రియాశీలంగా వ్యవహరించడం చర్చనీయాంశం అయింది. వీసీ ఛాంబర్‌ను వైఎస్సార్సీపీ కార్యాలయంగా మార్చారు. నిత్యం ఆ పార్టీ కార్యకర్తలు, నేతలతో సమావేశాలు నిర్వహించారనే ఆరోపణలు బాహాటంగానే ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ పుట్టిన రోజు వేడుకలకు విశ్వవిద్యాలయాన్ని వేదిక చేయడమే కాకుండా ఆ వేడుకల్లో ఆయనే స్వయంగా పాల్గొన్నారు.

గతంలో వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరించిన ఎంపీ విజయసాయిరెడ్డికి అనుచరుడిగా ముద్ర వేసుకున్న ప్రసాదరెడ్డి ఆయనతో కలిసి జీవీఎంసీకి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలిచేలా వ్యూహాలు రచించారనే ప్రచారం ఉంది. ఆ పార్టీ కార్పొరేటర్ల గెలుపునకు వెనకుండి పనిచేశారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడిన శిష్యుల సాయంతో సర్వేలు చేయించారని, ఆయా వార్డుల్లోని ఓటర్ల మార్పులు, చేర్పులను ఆయన చెప్పినట్లే చేశారన్న విమర్శలున్నాయి. వీసీ ప్రసాదరెడ్డే తనకు అన్యాయం చేశారని ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి ప్రస్తుతం జనసేన పార్టీలో చేరిన వంశీకృష్ణ యాదవ్‌ (MLC Vamsi Krishna Yadav) విలేకరుల సమావేశంలోనే చెప్పారు. అంటే ఆయన వైఎస్సార్సీపీ నేతలతో ఎంత సన్నిహితంగా ఉంటారన్నది అర్థమవుతోంది.

ఏయూ వీసీ​పై చర్యలు తీసుకోవాలి: టీడీపీ, సీపీఐ డిమాండ్

గతేడాది జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థిని గెలిపించేందుకు ప్రసాదరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అందులో భాగంగా ఏయూ పరిధిలోని కళాశాలల అధ్యాపకులతో దసపల్లా హోటల్లో సమావేశం నిర్వహించి అడ్డంగా దొరికిపోయారు. సమావేశానికి ఆయనే స్వయంగా హాజరైన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా ఒక వర్సిటీ వీసీ నేరుగా సమావేశం నిర్వహించి ఒత్తిడి తేవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దీనిపై ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు.

పదవీకాలం పూర్తయ్యే ముందు విశ్వవిద్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. రెండేళ్ల కిందట విశాఖలో నిర్వహించిన బహిరంగ సభ, ఇతర కార్యక్రమాలను అడ్డం పెట్టుకొని అటవీ, వాల్టా చట్టాలు ఉల్లంఘించారు. విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్‌ వసతి గృహాలకు సమీపంలోని నీటి గెడ్డలను మూయించి అక్కడున్న చెట్లను పూర్తిగా తొలగించి ఆ ప్రాంతాన్నంతటినీ చదును చేయించారు. దీనిపై అటవీశాఖకు ఫిర్యాదు అందడంతో ఆ శాఖ అధికారులు వాల్టా చట్టం, టేకు చెట్లను నరికి అనుమతి లేకుండా తరలించడంపై వర్సిటీ అధికారుల మీద కేసు నమోదు చేశారు.

ప్రసాదరెడ్డి అవినీతి, అక్రమాల ఆరోపణల చిట్టా కూడా పెద్దదే. వీసీగా పని చేసిన సమయంలో అవినీతికి పాల్పడ్డారని, ఆయనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పూర్వవిద్యార్థుల సంఘం గతేడాది నవంబరులో హైకోర్టులో పిల్‌ వేసింది. వర్సిటీలో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. ఏపీ విశ్వవిద్యాలయ చట్టానికి వ్యతిరేకంగా పదవీ విరమణ చేసిన ఆచార్యులను రిజిస్ట్రార్‌గా, ప్రిన్సిపాళ్లుగా కొనసాగించడం, సర్వీసులో ఉన్నవారికి ఉద్యోగోన్నతులు రాకుండా చేయడం, టీడీఆర్‌ హబ్‌ పేరిట నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్‌డీ సీట్లు విక్రయించారంటూ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ ఆచార్యులను వేధింపులకు గురిచేశారని, న్యాక్‌ ర్యాంకింగ్‌లో అవకతవకలకు పాల్పడ్డారని, రీ-రీవాల్యుయేషన్‌ ప్రక్రియ ద్వారా సొంత కళాశాలలకు లబ్ధి చేకూర్చారని వ్యాజ్యంలో తెలిపారు. ఆయనను మరోసారి వీసీగా నియమించకుండా ఉత్తర్వులివ్వాలని కోరారు. గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో కొంత సమయం వేచి చూద్దామని పేర్కొన్న రాష్ట్ర హైకోర్టు వ్యాజ్యాన్ని పెండింగ్‌లో పెట్టింది. ఈ లోగానే ప్రభుత్వం ప్రసాదరెడ్డినే మరోసారి వీసీగా నియమించింది.

ప్రసాదరెడ్డి శిష్యుడైన జేమ్స్‌ స్టీఫెన్‌కు వర్సిటీలో గత సెప్టెంబరులో కీలకమైన రిజిస్ట్రార్‌ పదవి కట్టబెట్టారు. ఇది కూడా ఆయన పదవీ విరమణకు రెండు నెలల ముందు అదనపు బాధ్యతల పేరుతో వైఎస్సార్సీపీ నేతల ద్వారా ఉత్తర్వులు వచ్చేలా చేసుకున్నారు. ఆయన వీసీగా లేని సమయంలో పనులు చేయించుకోవడం కోసమే ఆయనను నియమించుకున్నారన్న విమర్శలున్నాయి. వర్సిటీలో సీనియర్‌ ఆచార్యులు ఉన్నప్పటికీ వర్సిటీతో సంబంధం లేని వ్యక్తిని నియమించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతకముందు ఇతన్ని నిబంధనలకు విరుద్ధంగా ఏయూలో అంబేడ్కర్‌ అధ్యయన కేంద్రం ఛైర్‌ ప్రొఫెసర్‌గా తాత్కాలిక నియామకం పేరుతో వర్సిటీలో స్థానం కల్పించారు. సాధారణంగా లా, ఆర్ట్స్‌లో పీహెచ్‌డీ చేసినవారిని ఇందులో నియమించాల్సి ఉండగా కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసిన స్టీఫెన్‌ను కూర్చోబెట్టారు.

గతంలో రిజిస్ట్రార్‌గా పనిచేసిన వి.కృష్ణమోహన్‌ పదవీకాలాన్ని మూడు సార్లు పొడిగించడంలోనూ నిబంధనలు ఉల్లంఘించారని, యూజీసీ సూచించిన అడ్జంట్‌ ప్రొఫెసర్ల నియామకాలను ప్రకటన లేకుండా నియమించారన్న ఆరోపణలున్నాయి. కొద్ది రోజుల కిందట వర్సిటీలో జరిగిన యువజనోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి ఇన్‌ఛార్జి వీసీని ఆహ్వానించలేదు. ఆయన ఎస్సీ కావడంతోనే ప్రసాదరెడ్డి అనుచరవర్గం ఆహ్వానించలేదన్న ప్రచారం వర్సిటీలో సాగింది. ప్రసాదరెడ్డి వస్తే నిర్వహిస్తామంటూ స్నాతకోత్సవాల్ని వాయిదా వేశారన్న విమర్శలున్నాయి.

కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో సీనియర్‌ ఆచార్యుడైన ప్రసాదరెడ్డి గత కొంత కాలంగా వర్సిటీలో కీలక పదవులు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈయనకు వీసీ పదవి అప్పగించారు. 2019 జులై నుంచి 2020 నవంబరు వరకు పూర్తి అదనపు బాధ్యతలతో ఇన్‌ఛార్జి వీసీగా, 2020 నవంబరు నుంచి 2023 నవంబరు వరకు పూర్తి స్థాయి వీసీగా చేశారు. తాజాగా మరో మూడేళ్లు బాధ్యతలు అప్పగించారు.

యూనివర్సిటీ వీసీల స్వామి భక్తి - విద్య కంటే వైసీపీ వీరవిధేయతకే ప్రాధాన్యం!

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రసాదరెడ్డి - మరోసారి ఏయూ వీసీ

ABOUT THE AUTHOR

...view details