విశాఖ సాగర తీరం.. అంటే ముందుగా గుర్తొచ్చేది ఆర్కే బీచ్. సాయంత్రం సంధ్య వేళల్లో ఇసుక తిన్నెలపై నగరవాసులు, పర్యటకుల సందర్శనతో సందడిగా ఉండేది. ఇప్పుడు మహమ్మారి కరోనా వ్యాప్తితో నాలుగు నెలలుగా పర్యటక రంగం బోసిపోయి కనిపిస్తోంది. రుషికొండ, యారాడ వంటివి పూర్తిగా నిర్మానుష్యంగా మారాయి.
నగరంలో తీర ప్రాంతానికి చేరువగా ఉండే పర్యాటక ప్రదేశాలన్నీ కళ తప్పాయి. యుద్ధ విమాన ప్రదర్శనశాల టీయూ-142, సబ్ మెరైన్ మ్యూజియం, తెన్నేటి పార్కు, కైలాసగిరి, వుడాపార్కు వంటివి పూర్తిగా బోసిపోయాయి. కొవిడ్ వ్యాప్తి నివారణ దిశగా పర్యాటక ప్రాంతాలకు సందర్శకులను మరికొంత కాలం అనుమతించకుండా ఉండడమే మేలు అని ప్రజలు కోరుతున్నారు. పర్యటకం కంటే ప్రాణాలు విలువైనవి అని.. సడలింపులు ఇచ్చే కొద్దీ ప్రజల్లో కొవిడ్ నివారణ చర్యలపై స్పృహ తగ్గిపోతోందని నగరవాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ నగరానికి ఏటా రెండు కోట్ల వరకు పర్యటకుల తాకిడి ఉండేది. చలి, వేసవి కాలాల్లో ఎక్కువ మంది విశాఖకు వచ్చేందుకు వస్తుండేవారు. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి నెల నుంచి పూర్తిగా పర్యటక కార్యకలాపాలు నిలిచి పోవడం జిల్లా ఆర్థిక వృద్ధికి తీవ్ర నష్టం చేసిందనే చెప్పాలి.