Constructions on Rushikonda: విశాఖలోని రుషికొండపై భవన నిర్మాణాలకు 412 కోట్ల 37 లక్షల రూపాయలు వెచ్చించారు. ముఖ్యమంత్రి కార్యాలయంగా చెప్పుకుంటున్న ఈ భవనాల కోసం పర్యాటకశాఖ గుట్టుచప్పుడు కాకుండా నిధులు విడుదల చేసింది. విలాసవంతమైన ఈ భవనంలో ఫర్నిచర్ కోసం విలువైన ప్రజాధనాన్ని వెచ్చించింది. వంద కోట్లు దాటిన పనులపై.. జ్యూడీషియల్ ప్రివ్యూకు వెళ్తామన్న ప్రభుత్వ మాటలన్నీ ప్రగల్భాలని తేలిపోయింది.
నాడు ప్రజావేదిక కూల్చారు, మరి నేడు రుషికొండ విషయంలో అడుగడుగునా నిబంధనలకు తూట్లు
విశాఖలోని రుషికొండపై పర్యాటశాఖ పేరు చెప్పి ముఖ్యమంత్రి జగన్ కోసం... కార్యాలయం, నివాస భవనాలను కడుతున్నారంటూ కథనాలు రావటంతో.. అవి అవాస్తవాలని చెప్పేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసింది. అటువైపు ఎవరినీ వెళ్లనీయకుండా..చివరకు కోర్టుల కళ్లు కప్పి నిర్మాణాలు చేసేసింది. విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీసుగా చెప్పుకుంటున్న ఈ నిర్మాణాల కోసం పర్యాటకశాఖ ద్వారా వందల కోట్లు రూపాయలు ఖర్చు చేసినట్లు..స్పష్టమైన ఆధారాలు వెలుగుచూశాయి.
ఇప్పటివరకూ గోప్యంగా ఉంచిన జీవోలు తాజాగా... ఒక్కోక్కటిగా విడుదల చేస్తుండటంతో రుషికొండ వద్ద నిర్మాణాలకు ఎంత వెచ్చించారో బయటపడింది. ఈ భవనాల నిర్మాణానికి 412 కోట్ల 37లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడైంది. ఇక్కడ చేపట్టిన పనులను...చిన్నచిన్న ప్యాకేజీలుగా విభజించిన పర్యాటకశాఖ 6 జీవోలను జారీచేసి నిధులు విడుదల చేసింది. జీవో నెంబరు 92, 93, 94, 83, 179 పేరిట పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.