తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ డ్రైవర్ల ఉద్యోగాలను తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ విశాఖలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకంలో భాగంగా రూపొందించిన తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ పథకాన్ని అర్ధాంతరంగా నిలిపివేస్తూ తమను రోడ్డున పడేశారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉద్యోగాలు తిరిగి ఇప్పించాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ పార్క్ లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
7,193 రూపాయల జీతంతో దుర్భర జీవితం అనుభవిస్తున్నామని డ్రైవర్లు వాపోయారు. 104, 108 ఉద్యోగుల మాదిరిగా తమకు కూడా కనీస వేతనాలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని డ్రైవర్లు స్పష్టం చేశారు.