Complaint On Ear Machines Problems: పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న చిన్నారులకు ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్య శ్రీ పథకంలో బాధితులకు శస్త్రచికిత్సలు చేసి ఖరీదైన కాక్లియర్ ఇంప్లాట్ పరికరాలు అమర్చుతున్నారు. దీంతో వినికిడి సమస్య నుంచి ఉపశమనం లభించడమే కాకుండా చక్కగా మాట్లాడగలుగుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ చికిత్సలో వినియోగించే పరికరాల నిర్వహణ ఇప్పుడు కన్నవారికి భారంగా మారుతోంది.
పిల్లలకు అమర్చిన ఇంప్లాంట్ భాగాలూ మరమ్మతులకు గురైతే బాగుచేయించడానికి 12 వేల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తోంది. అంత మొత్తంలో ఖర్చు చేసే స్థోమత లేక, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. వాటిని ఉచితంగా బాగు చేయించి అందచేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు సోమవారం ఎనిమిది జిల్లాల నుంచి బాధిత తల్లిదండ్రులు విశాఖ కలెక్టరేట్‌కు వచ్చి స్పందనలో అధికారులను వేడుకున్నారు. వినికిడి పరికరాల నిర్వహణ భారం తొలగించాలని కోరుతున్నారు.
విశాఖలోని ప్రభుత్వ ఈఎన్టీ అసుపత్రిలో చిన్నారులకు అధునాతన వైద్య సేవలు అందిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ ఆసుపత్రికి వచ్చి వైద్యసేవలు పొందుతుంటారు. పదేళ్లలో వందల సంఖ్యలో పిల్లలకు శస్త్రచికిత్సలు చేసి, కాక్లియర్ ఇంప్లాంట్ పరికరాలు అమర్చారు. ఒక్కో వినికిడి పరికరం విలువ సుమారు 5 లక్షల రుపాయలపైనే ఉంటుంది. వీటిని అమర్చిన తర్వాత కంపెనీని బట్టి ఏడాది నుంచి మూడేళ్లు వరకు వారంటీ ఇస్తున్నారు.