IT Sector in Visakhapatnam: దస్త్రాల్లో చూస్తే రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - ఐటీ విధానం అద్భుతం.. క్షేత్రస్థాయిలో అమలు మాత్రం శూన్యం. విశాఖలో ఐటీ రంగానికి రాయితీలు, ప్రోత్సాహకాలు కరవయ్యాయి. 100 స్టార్టప్స్ మూతపడ్డాయి. డీటీపీ పాలసీ రద్దుతో మరికొన్ని కంపెనీలను మూసేశారు. ఐబీఎమ్, హెచ్ఎస్బీసీ వంటి భారీ సంస్థలు వెనుదిరిగాయి. కొత్త కంపెనీల జాడ లేదు. నాన్ సెజ్‌లో 20 నుంచి 25లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో భవనాలు కట్టినా అవన్నీ ఖాళీగానే ఉన్నాయి. నౌకాదళ నిబంధనలతో జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు విశాఖకు తగ్గాయి. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు లేనే లేవు. ఇక్కడ చదువుకున్న యువత హైదరాబాద్, బెంగళూరు బాట పట్టాల్సిందే. ఇదీ మొత్తంగా విశాఖపట్నం ఐటీ ప్రస్తుత పరిస్థితి.
రుషికొండ వద్ద ఉన్న హిల్-1పై మెరికల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్, ఫ్లూయింట్ గ్రిడ్ వంటి కంపెనీలు 7 ఎకరాల్లో ఉండగా.. రామానాయుడు స్టూడియో 40 ఎకరాల్లో ఉంది. హిల్-2లో సింబయాసిస్ టెక్నాలజీ, నవయుగ వంటి 10 సంస్థలకు 25 ఎకరాలు కేటాయించారు. హిల్-3లో 90 ఎకరాల భూములు సెజ్ కింద ఉన్నాయి. ఈ సెజ్ చివరిలో ఉన్న 25 ఎకరాల స్థలాన్ని కనెక్సా అనే సంస్థకి గతంలో కేటాయించారు. ఆ తర్వాత అదే భూమి ఐబీఎమ్కి బదలాయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఐబీఎం విశాఖను వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత మరో సంస్థకి అందులో 3.84 ఎకరాల స్థలాన్ని కేటాయించి మిగిలిన భూమిని ఏపీఐఐసీ వెనక్కి తీసుకుంది. ఇప్పటి వరకు ఆ భూమిని అభివృద్ధి చేయలేదు. ఇక్కడే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందని పలువురు ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఐబీఎమ్ వంటి పెద్ద సంస్థ విశాఖ నుంచి వెళ్లిపోగా, అదే బాటలో హెచ్ఎస్బీసీ పయనించింది. సిరిపురంలోని హెచ్ఎస్బీసీ కార్యాలయం, కాల్‌సెంటర్లలో ఒకప్పుడు 3 వేల 500 మంది పని చేసేవారు. హెచ్ఎస్బీసీ సైతం ఖాళీ చేసి వెళ్లిపోగా WNS అనే చిన్న సంస్థ ప్రస్తుతం అదే భవనాన్ని లీజుకు తీసుకుంది. హిల్-3 ప్రారంభంలో స్టార్టప్ విలేజ్ అని 50వేల చదరపు అడుగుల్లో భవనం నిర్మించారు. ఇక్కడ టీడీపీ ప్రభుత్వ హయాంలో వంద స్టార్టప్స్ ఉండేవి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అవన్నీ మూతపడ్డాయి. ఉన్నవి మూతపడినా పట్టించుకోకుండా.. గత మూడు, నాలుగు నెలలుగా ప్రభుత్వం స్టార్టప్స్‌కు పెద్దపీట అంటూ హడావుడి చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.