ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై మాట తప్పిన వైసీపీ సర్కార్

Contract Employees Problems In AP: రెగ్యులరైజ్ చేయాల్సిన ఒప్పంద ఉద్యోగుల సంఖ్య తగ్గించేందుకు.. ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎన్నికల ముందు వీలైనంత ఎక్కువ మందిని క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన జగన్‌.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 60 వేల మంది పనిచేస్తుండగా.. 10వేల మందిని క్రమబద్ధీకరించి చేతులు దులిపేసుకోవాలని భావిస్తున్నారు.

Contract Employees
ఒప్పంద ఉద్యోగులు

By

Published : Nov 28, 2022, 7:05 AM IST

Updated : Nov 28, 2022, 10:37 AM IST

Contract Employees Problems In AP: అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు, చదువులను పరిగణనలోకి తీసుకుని.. వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్‌ చేస్తామని ఎన్నికల సభల్లో జగన్ హామీ ఇచ్చారు. వైసీపీ మేనిఫెస్టోలో ఇదే మాట చెప్పారు. అంతటితో సరిపెట్టకుండా.. ఎన్నికల ముందు విడుదల చేసే మేనిఫెస్టోలో ప్రతి మాటను రాజకీయ పార్టీ నిలబెట్టుకోవాలని.. లేదంటే ఆ నాయకుడు పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలని గొప్పలు పోయారు. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

2014 జూన్‌ 2వ తేదీ కంటే ముందు 10ఏళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీనివల్ల విద్యాశాఖలో పనిచేస్తున్న అధ్యాపకులు, లెక్చరర్లలో చాలా మంది క్రమబద్ధీకరణ పరిధిలోకి రావడం లేదు. ప్రాజెక్టులు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేస్తున్న వారి జాబితానూ లెక్కలోకి తీసుకోవడం లేదు. అత్యధికంగా వైద్యఆరోగ్యశాఖ, జాతీయ ఆరోగ్య మిషన్‌లో కలిపి 19వేల మంది ఒప్పంద ఉద్యోగులు ఉన్నారు. ఆ తర్వాత విద్యాశాఖలో అధికంగా ఉన్నారు. వారి పరిస్థితి ఇప్పుడు గందరంగోళంగా మారింది.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై మాట తప్పిన వైసీపీ సర్కార్

ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం, సూచనలు చేసేందుకు తీసుకొచ్చిన వర్కింగ్‌ కమిటీ సమావేశాల్లో.. అర్హత కలిగిన ఉద్యోగుల సంఖ్య తరచూ మారిపోతోంది. గత మే నెలలో జరిగిన వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం.. అర్హత కలిగిన వారు 12వేల 255మంది ఉన్నట్లు తేల్చారు. వీరిని క్రమబద్ధీకరిస్తే మొదటి ఏడాది 431కోట్ల భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. వీరు కాకుండా వర్సిటీలు, సొసైటీలు, కార్పొరేషన్లు, ఇతరత్రా విభాగాల్లో ఉన్న 18వేల మందిని క్రమబద్ధీకరిస్తే మొదటి ఏడాది 632కోట్లు చెల్లించాలని లెక్కించారు. ఆ తర్వాత జూన్‌లో జరిగిన సమావేశంలో.. ఈ సంఖ్య 10వేల 117కు తగ్గిపోయింది. సీఎఫ్​ఎమ్మేస్​లో నమోదైన డేటా ప్రకారం ఈ సంఖ్యను నిర్ధారించినట్లు వర్కింగ్‌ కమిటీ పేర్కొంది. ఎన్నికల ముందు పెద్దపెద్ద మాటలు చెప్పి.. ఇప్పుడు ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదని కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

క్రమబద్ధీకరణకు ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. ఆర్థిక శాఖ ద్వారా మంజూరైన పోస్టులో పనిచేస్తూ ఉండాలని.. నియామక సమయంలో రిజర్వేషన్‌ నిబంధనలు పాటించి ఉండాలని అంటోంది. ఉద్యోగి ఎంపికకు ప్రకటన ఇచ్చి ఉండాలని, 2014 జూన్‌ 2 నాటికి పదేళ్ల సర్వీసు పూర్తి చేయాలని చెబుతోంది. అంటే.. వర్కింగ్‌ కమిటీ నివేదిక ప్రకారం.. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఒప్పంద ఉద్యోగులు.. 2014 జూన్‌ 2 నాటికి 11వేల 62గా ఉంది. ఆ తర్వాత నియమితులైనవారు 9వేల 17 మంది ఉన్నారు. నిబంధనల పేరిట ఇబ్బంది పెట్టకుండా.. తమకు న్యాయం చేయాలని ఒప్పంద ఉద్యోగులు కోరుతున్నారు.

జూనియర్‌ కళాశాలల్లో 2000 నుంచి 2013 వరకు ఒప్పంద లెక్చరర్ల నియామకాలు జరిగాయి. ఇంటర్మీడియట్‌లో 3వేల 720మంది లెక్చరర్లు ఉండగా.. 2014కు ముందు పదేళ్లు పూర్తి చేసుకున్నవారు సుమారు 800మంది మాత్రమే ఉన్నారు. పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఒప్పంద లెక్చరర్ల నియామకం 2005 నుంచి కొనసాగింది. ఇక్కడ 316మంది పని చేస్తుండగా.. ఒక్కరినీ క్రమబద్ధీకరించే పరిస్థితి లేదు.

డిగ్రీ కళాశాలల్లో ఒప్పంద అధ్యాపకుల నియామకాలు 2వేల సంవత్సరం నవంబర్ నుంచి జరిగాయి. ప్రస్తుతం 720మంది వరకు పనిచేస్తుంటే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సుమారు 150మందికి మాత్రమే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లో 19వందల 64మంది, ఏపీ రెసిడెన్షియల్‌లో 166మంది ఉన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌లో 15వేలు, సమగ్ర శిక్ష అభియాన్‌లో 10వేల 500 మందితోపాటు... కార్పొరేషన్లు, వర్సిటీల్లోనూ ఒప్పంద ఉద్యోగులు ఉన్నారు. వీరందరి పరిస్థితి దేవుడే దిక్కు అన్నట్లుగా తయారైంది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 28, 2022, 10:37 AM IST

ABOUT THE AUTHOR

...view details