ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్గదర్శి ఖాతాదారులపై 'సీఐడీ' ఒత్తిడి.. కొందరి ఇళ్లకు వెళ్లి మరీ! - CID Additional SP Ravi Varma

CID pressure on Margadarsi clients: మార్గదర్శి ఖాతాదారులపై సీఐడీ ఒత్తిడి చేస్తోంది. సెల్‌ఫోన్ల ద్వారా సంప్రదిస్తూ అనేక ప్రశ్నలు వేస్తోంది. కొందరి ఇళ్లకు వెళ్లి మరీ సంతకాలు సేకరిస్తోంది. చిట్స్‌ రద్దు చేసుకున్న వారితోనూ మాట్లాడిన అధికారులు.. ప్రొఫార్మా ఇచ్చి వివరాలు సమర్పించాలని సిబ్బందిని ఆదేశించారు.

CID pressure on Margadarsi clients
CID pressure on Margadarsi clients

By

Published : Mar 15, 2023, 11:25 AM IST

CID pressure on Margadarsi clients: రాష్ట్రంలో విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, రాజమహేంద్రవరం మార్గదర్శి శాఖల్లో మంగళవారం కూడా సీఐడీ అధికారులు, సిబ్బంది తనిఖీలు కొనసాగాయి. కొన్నిచోట్ల ఖాతాదారుల వివరాలు తీసుకున్నారు. వారికి ఫోన్‌ చేసి ఏమైనా సమస్యలున్నాయా..? ఎన్ని చిట్స్‌ వేశారు..? పూచీకత్తు ఎవరితో పెట్టించారనే ప్రశ్నలు అడిగారు. దర్యాప్తులో భాగంగా 15 కాలమ్స్‌తో ఉన్న పత్రాలను తయారుచేసి, అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. నెల, చిట్స్‌ సంఖ్య, సభ్యత్వం ఉన్న ఖాతాదారులు, డిఫాల్ట్‌, వేలం రాయితీ లేదా నష్టం, బహుమతి పొందిన చందాదారులు, నికర చిట్‌ మొత్తం, చెల్లింపు తేదీ, ఖాతాదారుల పూచీకత్తు రకం.. ఇలా పలు ప్రశ్నలను పొందుపరిచారు.

విశాఖపట్నంలోని సీతంపేట మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయంలో సీఐడీ అదనపు ఎస్పీ రవివర్మ ఆధ్వర్యంలో.. మంగళవారం ఉదయం పదకొండున్నర గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఖాతాదారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారు ఎక్కడున్నారో చెబితే అక్కడికే వచ్చి కలిసి మాట్లాడతామని చెప్పారు. కొందరి వద్దకు వెళ్లిన సీఐడీ సిబ్బంది, చిట్స్‌కు సంబంధించి కొన్ని ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానాలు రాయించి... చివర్లో సంతకాలు తీసుకున్నారు. చిట్స్‌ రద్దు చేసుకున్న వారికీ ఫోన్‌ చేసి ఎప్పుడు రద్దు చేసుకున్నారు..? డబ్బులు తీసుకున్నారా, లేదా..? ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని కోరారు. మినిట్స్‌ బుక్‌ వివరాలతో పాటు చిట్స్‌ ఎవరు పాడారు..? పూచీకత్తు ఎవరు పెట్టారనే సమాచార సేకరణకు మార్గదర్శి సిబ్బందిపై సీఐడీ అధికారులు ఒత్తిడి పెట్టారు. వివరాలు ఇవ్వడంలో విఫలమైతే ఐపీసీ సెక్షన్‌ 175 ప్రకారం శిక్షకు గురవుతారంటూ ఓ ఉత్తర్వును సిబ్బందికి మంగళవారం అందజేశారు. బుధవారం ఉదయం 9 గంటలకు సిబ్బంది అందరూ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

ఎన్ని రోజులు తనిఖీలు కొనసాగుతాయని అదనపు ఎస్పీ రవివర్మను అడగ్గా.. తనిఖీలు, సోదాలు, అరెస్టులు కొనసాగుతాయని, ఎన్ని రోజులని చెప్పలేమంటూ బదులిచ్చారు. ఏలూరు మార్గదర్శి కార్యాలయంలో వరుసగా నాలుగో రోజు సీఐడీ అధికారులు తనిఖీలు చేశారు. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు కార్యాలయంలోనే ఉన్నారు. నలుగురు సీఐడీ అధికారులు వచ్చి.. ఇన్‌ఛార్జి, అకౌంట్స్‌ సిబ్బందిని విచారించారు. బ్రాంచి పరిధిలో ఉన్న మొత్తం ఖాతాదారుల వివరాలు, ఎన్ని చిట్లు పాడారు, కమీషన్‌ రూపంలో ఎంత మొత్తం వచ్చింది, గ్రూపునకు ఎంత మంది ఉంటారనే వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని అడిగారు. గుంటూరులోని మార్గదర్శి అరండల్‌పేట బ్రాంచి కార్యాలయానికి సీఐడీ ప్రాంతీయ కార్యాలయం నుంచి ఓ ఉద్యోగి వచ్చారు. చిట్స్‌ యాక్టు జిరాక్స్‌ నకలు, ఇక్కడ బ్రాంచిలో ఏయే రకాల చిట్స్‌ ఉన్నాయి, వాటి ప్రైజ్‌మనీ వివరాలు కావాలని సిబ్బందిని కోరారు. మేనేజర్‌ లేరని, ఆ సమాచారం తమ వద్ద ఉండదని సిబ్బంది చెప్పారు. తాను ఒక ప్రొఫార్మా ఇస్తానని, ఆ ప్రకారం అధికారికంగానే సమాచారం అడుగుతున్నానని.. తిరిగి సాయంత్రం వస్తానని, వివరాలను సిద్ధం చేసి ఉంచాలని చెప్పి వెళ్లిపోయారు.

రాజమహేంద్రవరంలో సీఐడీ అధికారులు మార్గదర్శి కార్యాలయానికి వెళ్లి ఉదయం 11 నుంచి సుమారు 2గంటల సేపు దస్త్రాలను పరిశీలించారు. చిట్‌ పాడుకుని ఇప్పటి వరకు డబ్బులు తీసుకోని ఖాతాదారుల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. తమ ఖాతాదారులు కానివారి వివరాలు అడిగారని సిబ్బంది తెలిపారు. ఏ సమాచారం కావాలో లేఖ రూపంలో ఇస్తే తెలియజేస్తామని సిబ్బంది చెప్పడంతో.. సీఐడీ అధికారులు వెనుదిరిగారు. రాజమహేంద్రవరం బ్రాంచి మేనేజర్‌ సత్తి రవిశంకర్‌ రిమాండ్‌ పొడిగింపుపై.. ఒకటో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి సునీత వద్ద మంగళవారం ఉదయం అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. 28 వరకు ఆయనకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details