Central Water Commission Visit Sileru Complex: కేంద్ర నీటి కమిషన్, గోదావరి నది నిర్వహణ బోర్డు సభ్యుల బృందం సీలేరు కాంప్లెక్స్‌లోని జలాశయాలను ఇవాళ పరిశీలించింది. ఏపీ జెన్కో అధికారులతో కలిసి కాంప్లెక్స్‌లోని డొంకరాయి, సీలేరు, బలిమెల జలాశయాలను పరిశీలించింది. జలాశయాల్లో నీటి నిల్వలు, ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏటా గోదావరి డెల్టాకు సీలేరు నుంచి విడుదల చేస్తున్న నీటికి సంబంధించిన లెక్కల వివరాలపై జెన్కో అధికారులు ఆరా తీశారు. బలిమెల నుంచి ప్రతి ఏటా విద్యుదుత్పత్తికి వాడుతున్న నీరు, గోదావరికి విడుదల చేస్తున్న నీటి వివరాలను తెలుసుకున్నారు. జలాశయాల నిర్వహణ పట్ల బోర్డు సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు.
సీడబ్య్లూసీ ముఖ్య ఇంజనీరు వి.రాంబాబు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సీలేరు కాంప్లెక్స్‌లో పర్యటించామన్నారు. జీఆర్ఎంబీ ఏర్పాటయిన తర్వాత ప్రాజెక్టుల ఆస్తులు, అప్పులు, పనితీరు, స్థితిగతులు పరిశీలిస్తున్నారని దీనిపై ఒక నివేదికను ఆయా బోర్డులు వారి యాజమాన్యాలకు అందజేస్తారని తెలిపారు. నివేదిక ప్రకారం..ఈ ప్రాజెక్టులు గోదావరి నది నిర్వహణ బోర్డు పరిధిలోకి వస్తాయా? రావా? అని పరిశీలిస్తారన్నారు.