Rishikonda Illegal Mining latest updates: విశాఖపట్నం జిల్లాలో ఉన్న రుషికొండకు సంబంధించి.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారని కొన్ని నెలల క్రితం విశాఖపట్నం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, జనసేన పార్టీ నేత మూర్తి యాదవ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్లపై పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం.. రిషికొండ తవ్వకాల విషయంలో క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కూడిన కమిటీని నియమించింది. వీలైనంత త్వరగా రుషికొండ తవ్వకాలకు సంబంధించిన వివరాలను హైకోర్టుకు సమర్పించాలని కమిటీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
రిషికొండ తవ్వకాలపై నివేదక సమర్పణ:ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర కమిటీ.. క్షేత్రస్థాయిలో విచారణను మొదలుపెట్టింది. రిషికొండపై జరుగుతున్న తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కమిటీ ఇవాళ హైకోర్టులో తన నివేదికను సమర్పించింది. దీంతో నివేదికను పరిశీలించిన న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 26వ తేదీకి వాయిదా వేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
రిషికొండ తవ్వకాలపై హైకోర్టులో పిటిషన్లు: గతంలో రిషికొండపై నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని.. జనసేన కార్పొరేషన్ మూర్తియాదవ్, టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. రిషికొండపై జరుగుతున్న తవ్వకాలు, భవన నిర్మాణాలు ఎంతమేర జరుగుతున్నాయో.. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఇటీవలే ఐదుగురు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో కమిటీని ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో పర్యటించిన కేంద్ర బృందం నేడు నివేదికను హైకోర్టుకు సమర్పించింది.