విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కోనాం జలాశయంలో పడప బోల్తా పడి గిరిజన మహిళ మృతి చెందింది. ఆమెను కాపాడుకునేందుకు భర్త ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కోనాం గ్రామానికి చెందిన దారపర్తి కొండలరావు, దేముడమ్మ దంపతులు కుమారుడితో కలిసి గురువారం ఇంటి పైకప్పుకి అవసరమైన తాటాకులు తీసుకురావడానికి కోనాం జలాశయం అవతలకు నాటు పడవలపై వెళ్లారు. తాటాకులు వేసుకొని తిరిగి వస్తుండగా జలాశయం మధ్యలోకి వచ్చేసరికి ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి. ఆ దంపతులు ప్రయాణిస్తున్న నాటుపడవ బోల్తా పడింది. కొండలరావుకి ఈత రావటంతో మునిగిపోతున్న భార్యను కాపాడేందుకు తీవ్ర ప్రయత్నం చేశాడు. ఆమెను పట్టుకొని ఈదుకుంటూ ఒడ్డుకు తీసుకువస్తుండగా పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఇద్దరు మునిగిపోతామని గ్రహించిన దేముడమ్మ... భర్త కొండలరావును తోసేసింది. చేసేదేమీ లేక కొండలరావు ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. భార్య దేముడమ్మ నీటిలో మునిగిపోయింది. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున జలాశయం వద్దకు చేరుకున్నారు. సీఐ ఈశ్వరరావు, ఎస్సై సురేష్ కుమార్, ఉప తహసీల్దార్ శ్రీరామ్మూర్తి, అధికారులు దగ్గరుండి చేపల వలలతో గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని గంటల తర్వాత దేముడమ్మ మృతదేహం లభించింది.
భర్త కళ్లెదుటే భార్య జల సమాధి - కోనాం జలాశయం
విశాఖ జిల్లాలోని కోనాం జలాశయంలో నాటు పడప బోల్తా పడి ఓ గిరిజన మహిళ ప్రాణాలు కోల్పోయింది. తన కళ్లెదుటే భార్య నీట మునుగుతున్నా కాపాడుకోలేకపోయాడు భర్త. ఈత వచ్చినప్పటికీ ఏమీ చేయలేకపోయాడు.
women dead