దేశ గృహ నిర్మాణ రంగానికి ఊపునిచ్చే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిర్మాణంలో ఉన్న గృహాలపై ప్రస్తుతమున్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ మండలి ఆదేశాలు జారీ చేసింది. నూతన రేట్లు 2019 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. దేశంలో వ్యవసాయం తర్వాత అధిక ఉపాధి కల్పించే రంగం రియల్ ఎస్టేట్. అసంఘటిత కార్మికులను అక్కున చేర్చుకుంటూ వారికి అధిక సంఖ్యలో పని కల్పిస్తోంది.
గృహ నిర్మాణాలపై తగ్గిన జీఎస్టీ
సామాన్యులపై తగ్గనున్న భారం
మధ్య తరగతి వ్యక్తి 40 లక్షలు పెట్టి ఇళ్లు కొనాలంటే దాదాపు 10 లక్షల వరకుపన్ను చెల్లించాల్సి వచ్చేది. సామాన్య మానవులకు ఈ రేట్లు చాలా భారంగా ఉండేవి. అందువల్లనిర్మాణ రంగ వృద్ధి కాస్త మందగించింది. తాజా నిర్ణయంతో రియల్ఎస్టేట్ రంగం నుంచి ఆదాయం పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
సరసమైన గృహాలంటే?
45 లక్షల రూపాయల లోపు గృహ కొనుగోలుపై ఇప్పటి వరకు 8 శాతం వరకు పన్ను చెల్లిస్తుండగా.. ఇకపై అది 1శాతం కానుంది. అంతే కాకుండా సరసమైన గృహాలకు ప్రస్తుతమున్న నిర్వచనాన్ని జీఎస్టీ కౌన్సిల్ మార్చింది. మెట్రో నగరాల్లో 60 చదరపు మీటర్ల కంటే తక్కువ ప్రాంతంలో నిర్మించే గృహాలను సరసమైన గృహాలుగా అభివర్ణించింది. మెట్రోయేతర నగరాల్లో 90 చదరపు మీటర్లు లోపు స్థలంలో నిర్మించే గృహాలు ఆ కోవలోకి వస్తాయి.
"సిమెంట్ ధరలతో నష్టపోతున్నాం"
సిమెంట్ ధరల హెచ్చు, తగ్గుల వల్ల బిల్డర్లు నష్టపోతున్నారని విశాఖలోని క్రెడాయ్ అధికారులు చెబుతున్నారు. కృత్రిమ లోటును సృష్టిస్తూ ధరలను సిమెంట్ వ్యాపారులు విపరీతంగా పెంచుతున్నారన్నారు. 2018 జనవరిలో 230 రూపాయలున్న బస్తా ధర..ఇప్పుడు 350కి చేరిందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించి ధరలు అదుపు చేసేలా నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.