ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

15 రోజుల ఇటుకల పండగ.. ఏం చేస్తారో తెలుసా..!

ప్రకృతి రమణీయతతో అలరారే విశాఖ మన్యం.. అన్నింటికీ ప్రత్యేకమే... ఇక్కడ గిరిజనులు నిర్వహించుకునే పండుగలు విభిన్నంగా ఉంటాయి. రాష్ట్రమంతా ఒకలా ఉంటే... మన్యంలో పండుగలు వేరుగా ఉంటాయి. తరతరాల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు... మన్యం బిడ్డలు.

By

Published : Apr 22, 2019, 11:14 PM IST

Updated : Apr 23, 2019, 7:16 AM IST

15 రోజుల ఇటుకల పండగ.. ఏం చేస్తారో తెలుసా..!

15 రోజుల ఇటుకల పండగ.. ఏం చేస్తారో తెలుసా..!

ఎక్కడైనా పండగ అంటే ఒకటి రెండు రోజులే చేసుకుంటారు. విశాఖ మన్యంలోని గిరిజనులు మాత్రం ఇటుకల పండగను 15 రోజులు చేసుకుంటారు. ఏటా ఏప్రిల్ మెుదటి వారం నుంచి ఉత్సవంలా నిర్వహిస్తారు. ఈ వేడుక కోసం అన్ని పనులు వదిలి పండగకే ప్రాధాన్యమిస్తారు. ఓ వైపు బతుకు బండిని లాగుకుంటూ.... పండగలో తమ ఆనందాన్ని వెతుక్కుంటారు.

మహిళలే వసూలు చేస్తారు...
మన్యంలో ఇటుకల పండగ పురస్కరించుకొని పదిహేను రోజులపాటు గ్రామస్థులందరూ పండుగలో నిమగ్నమవుతారు. పండుగ మొదలయ్యే ముందుగానే రోజువారి తిండికి అవసరమయ్యే రాగుల పిండి, బియ్యం తదితరాలను సామగ్రిని ఇంటికి తెచ్చుకుంటారు. గ్రామాల్లోని మహిళలంతా ఒక్కటిగా వచ్చి రహదారులకు అడ్డంగా కర్రలను పెట్టి గేట్లుగా మారుస్తారు. ఈ ప్రక్రియనే గిరిజనుల పాజర్ అంటారు. ఈ చర్యకు అర్థం.. జరిమానా వసూలు చేయటం. పండుగ జరిగే రోజుల్లో గ్రామస్థులు ఎవరూ ఊరు దాటి బయటికి వెళ్లకూడదు. ఇతర గ్రామాల ప్రజలు తమ గ్రామాలలో అడుగు పెట్టకూడదు. పెడితే వారి నుంచి సొమ్ములు వసూలు చేస్తారు. ఎటువంటి డిమాండ్ లేకుండానే వాహనదారులు తమకు నచ్చినంత సొమ్మును మహిళలకు ఇస్తారు. ఇలా వసూలు చేసిన డబ్బులతో మహిళలంతా పండుగ చేసుకునేందుకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేస్తారు.

వేటకు వెళ్లకపోతే అంతే..!
పండుగ జరిగే 15 రోజులు గ్రామాల్లోని పురుషులంతా సమీపంలోని కొండపైకి వెళ్లి జంతువులను వేటాడుతారు. గిరిజన సంప్రదాయ ఆయుధాలతో వేటాడిన మాంసాన్ని సమానంగా పంచుకొని విందు ఆరగిస్తారు. వేటకు వెళ్లని మగవాళ్లను మహిళలంతా వెంబడించి కొండపైకి పంపిస్తారు. పండుగ జరిగే పదిహేను రోజులు గిరిజన దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. తొలకరి వర్షాలు కురిసే సమయంలో నిర్వహించే ఇటుకల పండుగ.. రైతులకు మంచి పంటలను ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తారు. ఈ సందర్భంగా వరుణుడికి పూజలు చేస్తారు. విత్తనాలను ఇంటింటికీ పంపిణీ చేస్తారు. నారు వేసే విత్తనాలతో వీటిని కలిపి పంట పొలాల్లో చల్లితే బంగారు పంటలు పండుతాయని గిరిజనుల విశ్వాసం.
పండుగను పురస్కరించుకొని పదిహేను రోజులపాటు గిరిజన సంప్రదాయ నృత్యం థింసాతో.. ఆనందోత్సాహంగా ఆడి పాడుతారు. ఈ పండగ రోజుల్లో గ్రామాలకు వచ్చే బంధువులను గౌరవించి వారికి గ్రామస్థులంతా కలిసి విందు ఏర్పాటు చేస్తారు.

Last Updated : Apr 23, 2019, 7:16 AM IST

ABOUT THE AUTHOR

...view details