రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఆంధ్ర ప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ పని చేస్తోందని ఆ సంస్థ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకుని పని చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే శ్రీసిటీలో ఉన్న పరిశ్రమలను సమన్వయం చేసుకొని నిరుద్యోగ యువతకు నాణ్యతతో కూడిన శిక్షణ ఇచ్చామన్నారు.
"రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం. స్థానికులకు 70 శాతం ఉపాధి కల్పన సాగాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్న పరిశ్రమలు ఎన్ని.. వారికి ఎంతమంది సిబ్బంది అవసరం.. ఉండాల్సిన అర్హతలు సేకరించి ఎప్పటికప్పుడు వారితో సంప్రదించి ఉపాధి కల్పిస్తునాం. విశాఖ జిల్లా పరవాడలో ఉన్న పరిశ్రమల్లో 80 శాతం పరిశ్రమలతో నైపుణ్య అభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకుంది. ఫలితంగా జిల్లాలో యువతకు నాణ్యతతో కూడిన శిక్షణను, చక్కటి ఉపాధిని సంస్థ అందిస్తోంది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత రాష్ట్ర నైపుణాభివృద్ధి సంస్థకు దరఖాస్తు చేసుకుంటే..వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం."