Andhra Pradesh Is In Debt: రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో సాధారణ ప్రజలకు సైతం అనుభవంలోకి వస్తోంది. ఈ నెల 15 వరకు జీతాలు, పెన్షన్లు కూడా అందక..అవి ఎప్పుడు వస్తాయో భరోసా లేక సాధారణ ఉద్యోగులు అల్లాడిపోయారు. మరో వైపు చిన్న చిన్న బిల్లుల సొమ్ములు రాక అనేక మంది విలవిల్లాడుతున్నారు. గుత్తేదారులు, సరఫరాదారుల సంగతి సరేసరి. ఈ నెలలో అప్పు పుట్టే పరిస్థితి లేకుండా పోయింది.
ఓవర్‌డ్రాఫ్టు నుంచి బయటపడేందుకు ప్రభుత్వం దొంగ దారిలో రుణం పుట్టించి దాన్ని ఆర్బీఐకు చెల్లించి రోజులు నెట్టుకొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబరు నెలాఖరుకు రాష్ట్ర రెవెన్యూ లోటు అంచనాలకు మించి పోయిన వైనం కలవర పెడుతోంది. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో ఏడాది మొత్తానికి రెవెన్యూ లోటు 17వేల 36 కోట్లు మాత్రమే ఉంటుందని బడ్జెట్ అంచనాల్లో ప్రభుత్వం పేర్కొంది. నిజానికి ఆ స్థాయి రెవెన్యూ లోటు కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసేదే. అలాంటిది ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబరు నెలాఖరు నాటికి అంచనాలను మించి 270శాతం దాటిన రెవెన్యూ లోటు..ఏకంగా 46వేల 71 కోట్లకు చేరింది.
సాధారణంగా ఆర్థిక క్రమశిక్షణ సూత్రాల్లో రెవెన్యూ లోటును తగ్గించుకోవడం కీలకం. అంటే రెవెన్యూ రాబడిని మించి..ఖర్చు చేస్తే అది రెవెన్యూ లోటుగా మారుతుంది. రెవెన్యూ ఖర్చులన్నీ ఆస్తులను, ఆదాయాన్ని సృష్టించేవి కావు. ఒక వైపు అప్పుల విశ్వరూపం కనిపిస్తోంది. మరోవైపు ఆ అప్పులను రెవెన్యూ ఖర్చులకే సింహభాగం మళ్లించేస్తున్నారు.