Allotment of Land for Datacenter in Visakha Kapuluppada: విశాఖలోని కాపులుప్పాడలో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి భూ కేటాయింపులో మార్పు చేర్పులతో పాటు, భూమి ధరను నిర్ధారిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో డేటా సెంటర్, ఐటీ బిజినెస్ పార్కులు, రిక్రియేషన్ సెంటర్ల ఏర్పాటు కోసం మెస్సర్స్ వైజాగ్ టెక్ పార్కు లిమిటెడ్ కు కేటాయించిన సర్వే నెంబర్లు మార్పు చేస్తూ ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వీటీపీఎల్ కు కేటాయించిన 60 ఎకరాల భూమి ధరను ఎకరాకు కోటి రూపాయల చొప్పున కేటాయించేందుకు ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఆ భూమి ధరను నిర్ధారిస్తూ... వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలోని భీముని పట్నం మండలం కాపులుప్పాడలో 100 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు మెస్సర్స్ వైజాగ్ టెక్ పార్కు లిమిటెడ్ ముందుకు వచ్చింది. గతంలో కేటాయించిన 401/1 సర్వే నెంబరుకు బదులుగా 404/1 సర్వే నెంబరులో భూమిని కేటాయిస్తూ ప్రస్తుత ఉత్తర్వులు విడుదల చేశారు. ఎకరా భూమిని కోటి రూపాయల చొప్పున కేటాయించేందుకు అంగీకరిస్తూ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. కాపులుప్పాడలో వంద మెగావాట్ల డేటా సెంటర్, ఐటీ, బిజినెస్ పార్కు, స్కిల్ సెంటర్, రిక్రియేషన్ సెంటర్ల ఏర్పాటు కోసం వైజాగ్ టెక్ పార్కు లిమిటెడ్ కు ప్రభుత్వం గతంలో 60.29 ఎకరాలు కేటాయించింది. తాజాగా... సర్వే నెంబరు 401/1, 414/1,421/1లో 52.28 ఎకరాలను, సర్వే నెంబరు 405/1లో 8.01 ఎకరాలను వైజాగ్ టెక్ పార్కు లిమిటెడ్ కుకేటాయింపులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.