భూమి ఎక్కడ కేటాయిస్తారు?:
అదాని సంస్థకు గతంలో 175 ఎకరాల భూమిని కాపులుప్పాడ కొండపై కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా మధురవాడలోని స్థలాన్ని కేటాయిస్తారని ప్రకటించారు. దీంతో మధురవాడలో ఎక్కడ? ఎంత? భూమిని కేటాయిస్తారన్న విషయాలు చర్చనీయాంశంగా మారాయి. డేటా సెంటర్ పార్క్‌లోని సంస్థల కోసం పర్యావరణానికి అత్యంత అనుకూలమైన విద్యుత్తును దశలవారీగా సరఫరా చేయాలని, ఫలితంగా ఆయా సంస్థల కారణంగా పరోక్షంగా కూడా కాలుష్యం విడుదలవడానికి అవకాశం ఉండదని భావించారు.
ప్రాజెక్టు విలువను తగ్గించడంతో అత్యంత కీలకమైన సౌర విద్యుత్తు ప్లాంట్ వస్తుందా? రాదా? అన్నది తేలాల్సి ఉంది. డేటా సెంటర్, ఇంటిగ్రేటెడ్ బిజినెస్ పార్క్, రిక్రియేషన్ సెంటర్‌లతోపాటు నైపుణ్య విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేయనుంది. గత ప్రాజెక్టులో లేని ‘నైపుణ్య విశ్వవిద్యాలయం’ కొత్తగా చేరింది. ఇందులో వివిధ రంగాలకు చెందిన వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.