లెక్కల్లో తేడాలు.. వివరాలన్నీ అబద్ధాలు!
303 మంది విద్యార్థులకు భోజనం పెట్టి 501 మందిగా రికార్డుల్లో చూపించారు. బియ్యం 3400 కిలోలు ఉండగా కేవలం 1600 కేజీలు ఉన్నట్లు లెక్కల్లో చూపించారు. విశాఖ జిల్లాలోని ఓ గిరిజన విద్యార్థుల వసతి గృహంలో పరిస్థితి ఇది.
విశాఖ మన్యం జి.మాడుగుల కొత్తూరు గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. రికార్డులు, సరకుల నిల్వలను పరిశీలించారు. లెక్కల్లో తేడాలు గుర్తించారు. శుక్రవారం 303 మంది విద్యార్థులకు మాత్రమే భోజనాలు పెట్టిన నిర్వాహకులు.. 501 మందికి భోజనాలు పెట్టినట్టు వివరాలు నమోదు చేశారు. సరకుల్లోనూ తీవ్ర వ్యత్యాసం కనిపించింది. సుమారు 200 మందికి అదనంగా భోజనం సౌకర్యం ఇచ్చినట్లు లెక్కల్లో చూపారు. రికార్డుల్లో బియ్యం 1600 కిలోలు ఉన్నట్లు నమోదు చేయగా అక్కడ 3400 కిలోలు ఉండటాన్ని గమనించారు. లెక్కల్లో వ్యత్యాసం ఉండటంతో ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, ఉప వార్డెన్ మత్యరాజు, సహాయ గిరిజన సంక్షేమ అధికారి క్రాంతికుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు.