Temples closed today: చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 27 నిమిషాల వరకూ చంద్రగ్రహణం నేపథ్యంలో అన్ని రకాల దర్శనాలు, ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది. గ్రహణం తర్వాత సంప్రోక్షణతో ఆలయాన్ని శుద్ధి చేసి భక్తులను సర్వ దర్శనానికి అనుమతించనున్నారు. రాత్రికి జరగాల్సిన గరుడ సేవను కూడా తితిదే రద్దు చేసింది.చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలంలో ఆలయ ద్వారాలను ఉదయం 6.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. బెజవాడ దుర్గమ్మ, మహనంది ఆలయాల్ని ఉదయం 6 నుంచి సాయంత్రం ఏడున్నర గంటల వరకు మూసివేయనున్నట్లు వేదపండితులు తెలిపారు.
తిరుమల: చంద్రగ్రహణం నేపథ్యంలో అన్ని రకాల దర్శనాలు, ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది. తితిదేలో ఉన్న స్థానిక ఆలయాలను సైతం మూసివేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాలను మూసివేశారు. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి ఆలయశుద్ధి, కైంకర్యాలు నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు
శ్రీశైలం:చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవాలయాలను మూసివేశారు. దేవస్థానం ఈవో ఎస్. లవన్న, అధికారులు, ఉభయ దేవాలయాల అర్చకులు ఆలయంలో పూజలు నిర్వహించి ఉదయం 6.30 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేశారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు ఆలయ ద్వారాలు మూసి ఉంచుతారు. చంద్రగ్రహణం కారణంగా శ్రీశైల దేవస్థానం పరిధిలోని ఉపాలయాలైన సాక్షి గణపతి, హాటకేశ్వరం, శిఖరేశ్వరం ఆలయాలను కూడా మూసివేశారు. 6:30 తర్వాత గ్రహణం ముగిసిన వెంటనే స్వామి అమ్మవార్ల ఆలయ ద్వారాలు తెరచి ఆలయ శుద్ధి , సంప్రోక్షణ పూజలు చేపడుతారు. రాత్రి 8 గంటల నుంచి భక్తులను శ్రీ స్వామి అమ్మవార్ల అలంకార దర్శనానికి అనుమతిస్తారు.
కాణిపాకం: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఈరోజు ఉదయం 8 గంటలు నుంచి రాత్రి 8 గంటల వరకు మూసివేయనున్నారు. చంద్రగ్రహణం కారణంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పుణ్యా వచనం, ఆలయ శుద్ధి అనంతరం గోపూజ, స్వామికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేసి.. తిరిగి బుధవారంఉదయం 8 గంటల నుంచి సర్వదర్శనం. ప్రారంభించనున్నట్లు తెలిపారు.
మహానంది:రాహుగ్రస్తొదయ చంద్రగ్రహణం కారణంగా ప్రముఖ శైవ క్షేత్రం మహానంది ఆలయాన్ని మూసివేశారు. ఉదయం ఏడు గంటలకు మూసివేసిన ఆలయాన్ని తిరిగి గ్రహణానంతరం రాత్రి ఏడున్నర గంటలకు తెరువనున్నారు. ఆలయ మూసివేత కార్యక్రమంలో వేదపండితులు, ఆలయ చైర్మన్ మహేశ్వర రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.