ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

State sports authority: త్వరలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి క్రీడా మైదానాలు

State sports authority: పేద, మధ్యతరగతి క్రీడాకారులు సాధన చేసేందుకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న క్రీడా మైదానాలు త్వరలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలోని ఇండోర్ స్టేడియాల్లోని 66 కోర్టులు లీజుకు ఇవ్వబోతున్నారు. ప్లే అండ్ పే విధానం వచ్చాక ఇప్పటికే పలువురు పేద, మధ్య తరగతి క్రీడాకారులు సాధనకు దూరమయ్యారు. ఇకపై కోర్టులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే మిగిలిన వారు క్రీడలను పూర్తిగా వదిలేసే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

State sports authority
ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి క్రీడా మైదానాలు

By

Published : Nov 10, 2022, 12:37 PM IST

ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి క్రీడా మైదానాలు

State sports authority: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో శాప్ ఆధ్వర్యంలోని 52 బ్యాడ్మింటన్, 10 టెన్నిస్ కోర్టులు, నాలుగు స్కేటింగ్ రింగ్లను రెండేళ్లపాటు లీజుకిచ్చేందుకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్‌...టెండర్లను ఆహ్వానించింది. శాప్‌ నిర్వహిస్తున్న క్రీడా సముదాయాల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు తీసుకొన్న ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే పే అండ్‌ ప్లే విధానంతో పేద క్రీడాకారులు ఆటలకు దూరమవుతున్నారని..ఈనిర్ణయం మరింత ఇబ్బందికరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతిలో రెండు దశాబ్ధాలుగా వేల మంది పేద క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన శ్రీనివాస క్రీడాసముదాయం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లబోతోంది. తితిదే నిర్వహణలో ఉన్న శ్రీవెంకటేశ్వర ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో దాదాపు 20ఎకరాల విస్తీర్ణంలో శ్రీనివాస క్రీడా సముదాయం నిర్మించారు. తితిదే, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి నిధులతో నిర్మించిన ఈ క్రీడా సముదాయం 2003 డిసెంబర్‌ నుంచి క్రీడాకారులకు అందుబాటులోకి వచ్చింది. ప్రారంభంలో పేద క్రీడాకారులు వంద మందికి స్పోర్ట్స్‌ హాస్టల్‌ ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చారు. స్కేటింగ్‌, బాట్మింటన్‌, స్విమ్మింగ్‌, టెన్నిస్‌, ఫుట్‌బాల్‌, క్రికెట్‌, జూడో, రెస్లింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. నామమాత్రపు ప్రవేశ రుసుం చెల్లించి పేద క్రీడాకారులు సైతం శిక్షణ పొందుతున్నారు.

తిరుపతితో పాటు పరిసర ప్రాంతాల నుంచి దాదాపు 200మంది క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి శ్రీనివాస క్రీడా సముదాయానికి వస్తున్నారు. క్రీడాకారులతోపాటు నగర ప్రజల వ్యాయామానికి కేంద్రమైన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను ప్రేవేటు వ్యక్తులకు అప్పగించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాలుగు బాడ్మింటన్‌ కోర్టులు, రెండు టెన్నిస్‌ కోర్టులు, స్కేటింగ్‌ రింక్‌, ఈతకొలను, రెండు సంవత్సరాల కాలపరిమితితో నెలసరి అద్దె ప్రాతిపదికన బహిరంగ వేలం నిర్వహించడానికి టెండర్లు పిలిచారు. శాప్‌ నిర్ణయంపై క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

క్రీడా సముదాయాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం పేద క్రీడాకారులను క్రీడలకు దూరం చేసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రీడా సముదాయాలను సొంతం చేసుకొన్న సంస్థలు...క్రీడాకారుల నుంచి ఎంత మేర రుసుములు వసూలు చేయాలి...అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎక్కడికి వెళ్లాలన్ని అంశంపై స్పష్టత లేకపోవడం క్రీడాకారులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details