TDP Leader Somireddy Comments on Ministers about Water: గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సోమశిల జలాలకు సంబంధించి.. సుమారు 20 టీఎంసీలకు పైగానే నీరు వృథా చేశారని తెలుగుదేశంపార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) విమర్శించారు. సాగు, తాగునీటి వృథాపై రాష్ట్ర మంత్రులు విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు సాగు నీరు లేకుండా చేస్తున్నారని, మంత్రులు ఏం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు.
తిరుపతి జిల్లా నాయుడుపేటలో టీడీపీ సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం నివాసంలో టీడీపీ నాయకులతో కలిసి సోమిరెడ్డి చంద్రమోహన్ మీడియాతో మాట్లాడారు. సోమశిల జలాలు వృథా అవుతుంటే మంత్రులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎర్రమట్టి సిలికా సాండ్ చెరువుల్లో మట్టి గ్రావెల్‌తో డబ్బు కట్టలు లెక్కబెట్టుకోవడానికి సమయం సరిపోతుందన్నారు. లస్కర్లకు 17నెలల నుంచి జీతాలు ఇవ్వలేదని సోమిరెడ్డి ఆరోపించారు. వర్షం ద్వారా వచ్చే వరద నీరును వదిలేయడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.
కాలువల పొడవునా నీటి వృథా జరుగుతుందని ఆరోపించిన ఆయన, ప్రభుత్వం అందుకు తగిన చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పై నమ్మకం లేక సాగు మానుకుంటున్నారన్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నీటి వృథా జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్రిటిష్ కాలం నాటి చెరువులను సైతం ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. చెరువులను ధ్వంసం చేసి ఆ మట్టిని లేఅవుట్లకు తరలించడం ద్వారానే వేల కోట్లు సంపాదిస్తున్నారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూముల్లో(SC and ST assigned lands) అవకతవకలు జరుగుతున్నాయని సోమిరెడ్డి ఆరోపించారు. అసైన్డ్ లాండ్ పట్టాలకు సంబంధించి దళితులు, గిరిజనుల భూములను అధికార పార్టీకి చెందిన నేతలు, ప్రలోభపెడుతూ... తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారికి సహాకారం చేసే ఎమ్మార్వోలు, ఆర్డీవోల ఉద్యోగాలు పోయే పరిస్థితులు నెలకొన్నాయని హెచ్చరించారు.
వైసీపీ నేతలపై ఆరోపణలు చేసిన టీడీపీ మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 'సోమశిల జలాలకు సంబంధించి... సుమారు 20 టీఎంసీలకు పైగానే వృథా చేశారు. లస్కర్లకు 17నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. ఆయా ప్రాజెక్టుల ద్వారా నీరు వృథాగా పోతుంటే.. నీటిపారుదల శాఖ మంత్రితో పాటుగా... వ్యవసాయ శాఖ మంత్రి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆడుకుంటుంది. జగన్ చర్యల వల్లే రాష్ట్రం ప్రభుత్వం అప్పులు చేయడం, రైతులు ఆత్మహ్యత్యలు చేసుకోవడంలో మెుదటి స్థానంలో ఉంది. ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండానే మైనింగ్ చేస్తున్నారు. మైనింగ్ అక్రమాలపై ఆయా అధికారులకూ... కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.'- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీమంత్రి