Jewellery Thefted in Marriage : బంధువుల కోలాహలం.. ఆత్మీయ పలకరింపులు.. పెద్దల అశీర్వాదాల నడుమ వివాహ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. అంతలోనే వివాహానికి హాజరైన వారు ఉలిక్కిపడేలా చేసింది ఈ ఘటన. పెళ్లి కోసం తీసుకువచ్చిన బంగారం కనిపించక పోవటంతో పెళ్లివారు దిగ్భ్రాంతికి గురయ్యారు. సుమారు రూ. 20 లక్షల విలువ చేసే బంగారం కనిపించకపోవటంతో వధూవరుల కుటుంబంలో ఆందోళన మొదలైంది. బంగారు ఆభరణాలు కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో చోరీకి గురైనట్లు విచారణలో తేలింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నగలను స్వాధీనం చేసుకుని.. ఘటనకు పాల్పడిన వ్యక్తిని విచారిస్తున్నారు.
తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో వివాహ వేడుకలలో చోరీ జరిగింది. కేవీబీపురం మండలంలోని కలతూరుకు చెందిన వికాస్, మహేశ్వరుల పెళ్లి వేడుకలను శ్రీకాళహస్తిలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. వివాహానికి హాజరైన బంధుమిత్రులు వివాహ సంబరాల్లో మునిగిపోయారు. కళ్యాణ మండపంలోని ప్రాంగణమంతా పెళ్లి ఏర్పాట్లతో నిండిపోయి.. సందడిగా మారిపోయింది. అందరూ వివాహ కార్యక్రమంలో నిమగ్నమై పెళ్లి తంతు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో గదిలో భద్రపరచిన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.