ISRO: ‘రాకెట్‌కు ఇంధనంలాగా మీకు ఓ లక్ష్యం.. గమ్యం ఉండాలి. కలలు కానాలి.. వాటిని సాకారం చేసుకోవాలి. ఇలా విద్యార్థి దశ నుంచే ముందుకెళ్లాలి’ అని ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. తిరుపతి జిల్లా శ్రీ హరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో శనివారం యువికా-2022 విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఇస్రో ఉపగ్రహాలు మానవాళికి ఎంతగానో దోహదపడుతున్నాయని.. అంతరిక్ష సాంకేతికతతో పలు ప్రయోజనాలు కలుగుతున్నాయని తెలిపారు. ఇస్రో తుపాన్లు, సునామీలను గుర్తించి ముందస్తు హెచ్చరికలు చేయడంతో పెద్ద ప్రమాదాలు జరగడం లేదన్నారు. యువికా-2022 కార్యక్రమం ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులను ఒక చోటకు చేర్చి, వారి మనోభావాలు పంచుకునే అవకాశమిచ్చామని వివరించారు. యువికా 2022 కార్యక్రమానికి ఎంపికైన.. 153 మంది 8, 9, 10వ తరగతుల విద్యార్థులతో ఇస్రో ఛైర్మన్ ముఖాముఖిలో పాల్గొన్నారు. పలువురు విద్యార్థులు తమ ఆసక్తిని వివరించారు. ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి అంతరిక్ష శాస్త్రవేత్త కావాలని ఆకాంక్షించారు. అనంతరం ధ్రువపత్రాలు ప్రదానం చేశారు. షార్ సంచాలకులు రాజరాజన్, సీనియర్ శాస్త్రవేత్త అలెక్స్, సీబీపీవో సుధీర్‌కుమార్, డీడీ సెంథిల్‌కుమార్, ఎంఎస్‌జీ గ్రూపు డైరెక్టర్ గోపీకృష్ణ పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఇస్రో అధిపతి సోమనాథ్ సమాధానమిచ్చారు. వారి అనుమానాలు నివృత్తి చేశారు.
ఇంజినీరింగ్‌లో చేరిన తర్వాతే ఆంగ్లం నేర్చుకున్నా..: ‘నాకు 11, 12 తరగతుల వరకు ఇంగ్లిష్ రాదు. మాతృభాష మళయాళంలోనే చదివా.. ఇంగ్లిష్ అనేది ఇంజినీరింగ్ కళాశాలలో చేరిన తర్వాత నేర్చుకున్నా.. 11, 12 తరగతులతోపాటు ఇంజినీరింగ్ విద్యార్థులను యువికాలో భాగస్వామ్యం చేయమని మీరు అడుగుతున్నారు. వారు అప్పటికే ఆయా రంగాల్లో స్థిరపడి ఉంటారు. అందుకే 8, 9 తరగతుల విద్యార్థులైతే యువికాకు సరిపోతారు’. -సోమనాథ్, ఇస్రో ఛైర్మన్
పుస్తకాలు బాగా చదవాలి..: ‘రాకెట్ ప్రయోగాల్లో గణితం, భౌతికశాస్త్రం తప్పనిసరి.. విద్యార్థులు పుస్తకాలు బాగా చదవాలి. మా నాన్న నా కోసం కట్టలు కట్టలుగా పుస్తకాలు తీసుకొచ్చి ఇంట్లో వేసేవారు. నేను వాటిన్నింటినీ చదివేవాడిని. సైన్సు, గణితం తదితర అంశాలపై పట్టు సాధించాలి.’ -సోమనాథ్, ఇస్రో ఛైర్మన్