Drunken Attacks and Fights: ప్రపంచ నలుమూలల నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వచ్చే తిరుపతిలో మద్యం మత్తులో పలువురు చేస్తున్న వికృత చేష్టలు.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నగరంలోని బైరాగిపట్టెడ ప్రాంతంలో మద్యం మత్తులో ఉన్న యువత.. ఓ మహిళను వేధించడం పరస్పర ఘర్షణలతో ఓ వ్యక్తి హత్యకు గురవడం కలకలం రేపింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత ఏడాది 302 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగితే.. ఈ ఏడాది మొదటి 3 నెలల్లో వంద కోట్ల రూపాయల పైబడి మద్యం విక్రయించారు. జిల్లా పరిధిలో 27 బార్ల ద్వారా లైసెన్స్ రూపంలో ప్రభుత్వానికి 30 కోట్ల ఆదాయం వచ్చింది. తిరుపతి నగరపాలక పరిధిలో 16 బార్ల ద్వారా 24.30 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సమకూరింది. లైసెన్స్ ఫీజు రూపంలో కోట్ల రూపాయలు చెల్లించిన బార్ యజమానులు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. తిరుపతిలో మద్యం, మాంసం విక్రయాలను పూర్తిస్థాయిలో నిషేధిస్తామన్న టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటనలు సైతం.. మాటలకే పరిమితం అయ్యాయి.
గోవింద నామస్మరణలతో మారుమోగాల్సిన తిరుపతి వీధుల్లో ఇపుడు మద్యం సేవించిన యువత సృష్టించే అరాచకాలు.. కర్రలతో దాడులకు నిలయంగా మారుతోంది. రహదారిపై వెళ్తున్న మహిళను వేధించడం, చిన్నపిల్లలతో అసభ్యంగా మాట్లాడటం, వాహనాలను ఇష్టానుసారంగా నడుపుతూ ఇతరులకు ఇబ్బందులు కలిగించడం నగర వీధుల్లో నిత్యకృత్యంగా మారాయి. బార్‌లతో పాటు మద్యం దుకాణాల వద్ద బహిరంగంగా మద్యం సేవిస్తున్నా.. అరాచకాలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. రాజకీయ నేతల నుంచి వచ్చే ఒత్తిళ్లతో పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. బహిరంగంగా మద్యం తాగుతూ పట్టుబడిన వారు అధికార పార్టీ పేరు చెప్పి పోలీసులనే బెదిరిస్తున్న ఉదంతాలు నగరంలో చోటు చేసుకుంటున్నాయి.
"ఈ ప్రాంతంలో ఉన్న వైన్ షాప్ వల్ల చాలా ఇబ్బందింగా ఉంది. స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఈ దారి నుంచే వెళ్తారు. స్టూడెంట్స్ పాఠశాలల నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇదే ప్రాంతంలో తాగుబోతులు.. రోడ్లపై రచ్చరచ్చ చేస్తున్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. అది గొడవలకు దారి తీస్తోంది. ఇక్కడ ఉన్న కుళాయి దగ్గరకు వెళ్లి నీటిని తెచ్చుకునేందుకు కూడా మహిళలు వెళ్లలేక పోతున్నారు. ఎందుకంటే అదే కుళాయి దగ్గరకు మందుబాబులు వచ్చి.. మద్యం సేవిస్తున్నారు. రాత్రి సమయంలో కూడా ఈ ప్రాంతంలో చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టి వైన్ షాప్‌ను ఈ ప్రాంతం నుంచి తొలగించాలని కోరుకుంటున్నాము." - రూప్‌చంద్, తిరుపతి