BJP protests against installation of idols at toilets: గర్భగుడిలో ఉండాల్సిన దేవతామూర్తుల విగ్రహాలను తిరుపతి నగరపాలక సంస్థ బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయడంపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. తిరుపతిలోని శ్రీదేవి కాంప్లెక్స్ సమీపంలోని మరుగుదొడ్ల వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలకు, దేవతామూర్తులకు రక్షణ లేదని బీజేపీ నాయకులు తెలిపారు. చెత్త వేయకుండా, మూత్ర విసర్జన నిర్మూలించేందుకు హిందూ దేవతా విగ్రహాలను పావులుగా చేయడం వలన హిందువుల మనోభావాలు గాయపరచడం సరికాదని హితవు పలికారు.
ఇందుకు సాక్ష్యాత్తూ నగరపాలక కమిషనర్ పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసి హిందూ మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై నగరపాలక కమిషనర్ హరిత బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం మరుగుదొడ్ల వద్ద ఏర్పాటు చేసిన వెంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, వినాయకస్వామి, అమ్మవార్ల విగ్రహాలను తొలగించి నాలుగు కాళ్ల మండపం వద్ద గల పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో కమిషనర్‌పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.
"ఇది కోట్లాది హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా మున్సిపల్ అధికారులు వ్యహరించారు. వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని భారతీయ జనత పార్టీ డిమాండ్ చేస్తుంది. పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడి తిరునామాలు తీసుకొచ్చి మరుగుదొడ్ల వద్ద ఏర్పాటు చేశారు. గర్భగుడిలో నిత్యం పూజలు అభిషేకాలు అందుకోవలసిన హిందు దేవత విగ్రహలు తెచ్చి మరుగుదొడ్ల వద్ద ఏర్పాటు చేసి బహిరంగ ప్రదేశాల్లో చెత్త వెయ్యకూడదని బ్యానర్ ఏర్పటు చేయడం ఏంటి? చెత్త వెయ్యకూడదు అంటే ప్రజల్లో అవగాహన తీసుకురావాలి అంతేకానీ హిందూ దేవత విగ్రహాలు తీసుకొచ్చి పెడతారా ? కమిషనర్, ఆరోగ్యశాఖ అధికారులు అదే విధంగా విగ్రహాలు పెట్టిన వారిపై ఎఫ్ఆర్ఐ నమోదు చేయాలి. భవిష్యతులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా హిందువులకు మున్సిపల్ అధికారులు బహిరంగ క్షమపణలు చెప్పాలి". - భానుప్రకాష్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి
'ఆధ్యాత్మిక నగరంగా పేరు పొందిన తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పవిత్రమైన హిందూ దేవతామూర్తుల విగ్రహలు వెంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, వినాయకస్వామి, అమ్మవార్ల విగ్రహాలను మరుగుదొడ్ల ముందు ప్రతిష్ఠించి చెత్త వేయరాదు అనే సూచన ఇవ్వడం ద్వారా ఏ సందేహం ఇస్తున్నారు.. ఎవరిని అవమానించాలనుకుంటున్నారు.'' -సామంచి శ్రీనివాస్, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి