ఉద్యోగం కోల్పోయినా మరో వంద మందికి ఉపాధి చూపిన సురేశ్ - వంద ఎకరాల్లో 'సుగంధ' సేద్యం Young Man Earns Millions through Farming : కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచేందుకు.. డిప్లొమా అవగానే ఉద్యోగంలో చేరాడీ యువకుడు. కొన్నేళ్లు ఎలాంటి లోటూ లేకుండా సాఫీగా సాగిపోయింది జీవితం. తీరా జీవితంలో స్థిరపడ్డా అనుకునేసరికి పనిచేస్తున్న కంపెనీ కాస్తా మూతపడింది. కొవిడ్ కారణంగా ఉద్యోగ ప్రయత్నాలూ ఫలించకపోవడంతో మూడేళ్లు ఇంటికే పరిమితయ్యాడు. దీంతో తనకు తానే స్వయం ఉపాధి ఎందుకు కల్పించుకోకూడదని భావించాడు. అనుకున్నదే తడవుగా వినూత్న తరహాలో వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ మంచి లాభాలు గడిస్తున్నాడీ యువకుడు.
Lost his Job Arrival of Covid: శ్రీకాకుళం జిల్లాలోని బోరాడ గ్రామానికి చెందిన సురేష్ ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. ఇంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిప్లొమాలో మెకానికల్ ఇంజినీరింగ్ పట్టా చేతికిరాగానే ఉద్యోగంలో చేరిపోయాడు. 8 సంవత్సరాలపాటు ప్రశాంతంగానే గడిచిపోయిందతడి జీవితం. కొవిడ్ వల్ల కంపెనీ మూతపడటంతో ఉపాధి కోల్పోయాడు.
"ఉద్యోగావకాశాల కోసం మూడేళ్లపాటు ప్రయత్నించినా ఎక్కడా దొరకలేదు. కుటుంబానికి భారం కాకూడదనే ఉద్దేశంతో ఖాళీ సమయంలో పొలం పనులు చూసుకునేవాడిని. అలా ఆధునిక సేంద్రియ విధానంపై ఆసక్తి కలిగింది. ఇంటర్‌నెట్ ద్వారా సుగంధ ద్రవ్యాల పంట సాగు గురించి తెలుసుకున్నాను.కేంద్ర ప్రభుత్వం ఇందులో రైతులకు ప్రత్యేక ప్రోత్సాహమిస్తోందని తెలిసి.. హైదరాబాద్‌లోని శిక్షణా కేంద్రంలో మెళకువలు నేర్చుకున్నాను". - సురేష్, రైతు
2019లో గులుమూరు, కొమనాపల్లి గ్రామాల పరిధిలో 100 ఎకరాలను లీజుకు తీసుకొని సాగు ప్రారంభించాడు సురేష్. కరెంటు లోటు రాకుండా ఉండేందుకు రూ.10 లక్షలు వెచ్చించి సౌరవిద్యుత్ పరికరాలను పొలంలోనే అమర్చుకున్నాడు. హైదరాబాద్, ఒడిశాలోని రెండు సంస్థల నుంచి నాణ్యమైన విత్తనాలు తెచ్చి సుగంధ ద్రవ్యాల సాగు మొదలుపెట్టాడు. కేవలం ఇవొక్కటే కాకుండా.. పూలూ, కూరగాయల పంటతోనూ ఆదాయం పొందుతున్నాడు.
మొదట్లో అంత సానుకూలంగా ఏమీలేదని.. పోనుపోనూ తక్కువ పెట్టుబడితోనే అధిక లాభం పొందేలా మెళకువలు నేర్చుకున్నాని చెబుతున్నాడు సురేష్. సుగంధ ద్రవ్యాల ఆకులు, పువ్వులతో నూనె కషాయాలను బాయిలర్ల ద్వారా తయారు చేస్తున్నాడు. ఔషధ గుణాలున్న లెమన్ గ్రాస్,పామారోజ్, తులసి, అశ్వగంధ, కియా నూనెలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందంటున్నాడు. ఈ ఉత్పత్తులను గుంటూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నాడు.
"ఈ పంటలను ఒక్కసారి నాటితే 40 నుంచి 90 రోజుల్లోనే ఉత్పత్తులు రావడమేగాక.... 6 సంవత్సరాల వరకూ ఆదాయం పొందవచ్చు. సొంతంగా లెమన్ గ్రాస్ నుంచి దోమల కాయిల్స్ తయారు చేస్తూ.... సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండ్లు పండిస్తూ చుట్టుపక్కల గ్రామాల వారికి ఉచితంగా అందిస్తున్నాను. సాంకేతిక పనిముట్లను ఉపయోగించడం వల్ల సమయం ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది". - సురేష్
ఒకరి కింద పని చేసి బతకడం కంటే తన కాళ్లమీద తాను నిలబడటం చాలా గొప్పదని భావించి సక్సెస్ అయ్యాడు ఈ యువరైతు సురేష్. సుగంధ ద్రవ్యాల పంటలు సాగు చేయడమే కాకుండా విత్తనోత్పత్తి కూడా చేస్తూ తక్కువ ధరలకే రైతులకు అందిస్తున్నాడు. మరోవైపు రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పంటలు పండించాలని రైతులకు సలహాలు ఇస్తున్నాడు.