Students In Temple : నాడు - నేడు పథకానికి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో శ్రీకాకుళం జిల్లాలో పాఠశాల అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పాఠశాలల్లో మౌలిక వసతులు సరిగ్గా లేక అంగన్వాడి కేంద్రాలు, ఆలయాల్లో పాఠాలు చెబుతున్నారు. మరుగుదొడ్లు తరగతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం గదబపాలెం గ్రామం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో 4 నెలల క్రితం నేలమట్టం చేశారు. నాడు-నేడులో కొత్త భవన నిర్మాణం చేపట్టారు. నూతన భవన నిర్మాణానికి 30 లక్షలు మంజూరు కావడంతో పనులు ప్రారంభించారు. గుత్తేదారు పిల్లర్లు వేశారు. ఇక అంతే అక్కడి నుంచి ఇటుక పెడితే ఒట్టు. ఇప్పటి వరకు 93 వేలు మాత్రమే చెల్లింపులు జరగగాయి. గుత్తేదారుకు మిగిలిన బిల్లులు రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
గదబపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి ఐదో తరగతి వరకూ 40 మంది విద్యార్థులున్నారు. పిల్లల చదువులు ఆగిపోకుండా ఉపాధ్యాయులు సర్దుబాటు చేశారు. సగం మంది విద్యార్థులకు ఊళ్లోని రామాలయంలో పాఠాలు చెప్తున్నారు. బడి ఎలాగో, గుడీ అలాగే. రోజూ పూజలు జరగుతుంటాయి. ఎవరో ఒకరు దర్శనాలకు వచ్చి వెళ్తుంటారు. అలాంటి సమయాల్లో ఇబ్బందిగా ఉంటోందని విద్యార్థులు చెప్తున్నారు.
బడి భవనం కూల్చేయడంతో ఇంకొంత మంది విద్యార్థులను అంగన్వాడీ కేంద్రంలో కూర్చోబెడుతున్నారు. అక్కడ ఇరుకుగా ఉంటోందని పిల్లులు చెప్తున్నారు. విద్యార్థులు తాగునీరు, మరుగుదొడ్లు లాంటి సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు.