శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు సంచారం మళ్లీ మొదలైంది. సరిహద్దు ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఎప్పుడు గ్రామాల్లోకి వచ్చి దాడి చేస్తాయోనని వణుకుతున్నారు. 14 ఏళ్లుగా గజరాజులు అటూఇటూ తిరుగుతూ నష్టం కలిగిస్తూనే ఉన్నాయి. భామిని, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, మెళియాపుట్టి, పాతపట్నం మండలాల పరిధిలోని గ్రామాల్లోనే తిష్ఠవేసి సంచరిస్తూనే ఉన్నాయి.
నష్టం ఇలా..
ఇటీవల కరిరాజుల వల్ల కొత్తూరు, మెళియాపుట్టి, భామిని, వీరఘట్టం, పాతపట్నం, ఎల్.ఎన్.పేట తదితర మండలాల్లో ఇప్పటివరకు 500 ఎకరాల్లోని అరటి, మామిడి, పనస, వరి, జొన్న పంటలకు నష్టం జరిగింది. గిరిజన గ్రామాల్లో గుడిసెలు, విద్యుత్తు మోటార్లు, బోర్లు, ఇతర సామగ్రి ధ్వంసం చేశాయి. వీటి విలువ రూ.2 లక్షలు ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
ధ్వంసం.. దాడులు..
గత మూడు రోజులుగా కొత్తూరు మండలంలో ఏనుగులు తిరుగుతూ పంటలు, మోటార్లను ధ్వంసం చేస్తున్నాయి. గత ఆదివారం సాయంత్రం వసప గ్రామానికి చెందిన వ్యక్తి వీటి దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. వంశధార నదికి ఇరువైపులా తిరుగుతున్నాయి. కడుము మీదుగా ఒడిశాలోకి వెళ్లిన గజరాజులు తిరిగి ఇటువైపు వచ్చేశాయి. వసప, కుంటిభద్ర గ్రామాల మధ్యలోని తోటల్లో ప్రస్తుతం తిష్ఠ వేశాయి.
ప్రతిపాదనలన్నీ గాలిలోనే..
* ఆపరేషన్ గజ పేరిట తిరిగి ఒడిశాకు తరలించేందుకు అధికారులు గతంలో తీసుకున్న చర్యలు మధ్యలోనే ఆగిపోయాయి.
* సంచరించే ప్రాంతంలో కందకాలు నిర్మిస్తామని చెప్పినా అదీ కదల్లేదు.
* జంతు ప్రదర్శనశాలకు తరలించేందుకూ అడుగులేసినా ఫలితం లేకపోయింది.
* ప్రస్తుతం మన్యం, సిక్కోలు ప్రాంతాల్లో ఏదోఒకచోట ఏనుగుల కారిడార్ ప్రతిపాదన తీసుకొచ్చినా అదీ కార్యరూపం దాల్చలేదు.
ఇవిగో సాక్షాలు..