ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాసిరకం హెల్మెట్లపై పోలీసుల దృష్టి - Police inspecting helmets in Srikakulam district

అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు ద్విచక్ర వాహనాల కారణంగానే జరుగుతున్నాయి. ఇందులోనూ ఎక్కువ మంది తలకు గాయం కావడంతోనే మరణిస్తున్నారు. హెల్మెట్‌ వినియోగించక ప్రాణాలు కోల్పోతున్నారు.

helmet
హెల్మెట్​ను పరిశీలిస్తున్న పోలీసు

By

Published : Jul 12, 2021, 9:59 AM IST

కొవిడ్‌ కారణంగా ఏడాదికి పైగా నుంచి పోలీసులు, రవాణా శాఖ అధికారులు తనిఖీలు పెద్దగా నిర్వహించడం లేదు. దీంతో శిరస్త్రాణం వినియోగం తగ్గింది. ఈ నేపథ్యంలో హెల్మెట్ల వాడకంపై పోలీసులు ప్రత్యేకంగా సర్వే చేపట్టారు. నాసిరకం వాటిని వాడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వాహనదారులకు సూచించారు. నిత్యం నమోదవుతున్న ఉల్లంఘనల్లో ఎక్కువ భాగం అవే. తనిఖీలు ఉన్నప్పుడు ధరించడం, లేని సమయాలలో ద్విచక్ర వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

  • శ్రీకాకుళం జిల్లాకు చెందిన సత్యనారాయణ.. విజయవాడలోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగి. ఇటీవల స్వస్థలానికి వెళ్లి తిరిగి స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై బెజవాడకు బయలుదేరారు. హనుమాన్‌ జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి బైక్‌ అదుపుతప్పి జాతీయ రహదారిపై ఉన్న డివైడర్‌ని ఢీకొంది. ద్విచక్ర వాహనంపై నుంచి వీరు ఎగిరి డివైడర్‌ మధ్యలో ఉన్న ఇనప రెయిలింగ్‌పై పడ్డారు. దీంతో తలకు బలమైన గాయాలై ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. బైక్‌ నడుపుతున్న సత్యనారాయణ హెల్మెట్‌ పెట్టుకోలేదు.
  • జగ్గయ్యపేట పట్టణానికి చెందిన మెకానిక్‌ అల్లాబక్షు, ద్విచక్ర వాహనంపై ఆటోనగర్‌కు బయలుదేరాడు. ఎదురుగా వస్తున్న ట్రక్కు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడ్డ అల్లాబక్షును పోలీసులు, స్థానికులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. హెల్మెట్‌ లేకపోవడం, తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

పోలీసుల సర్వేలో..

ద్విచక్ర వాహనదారులు ఎటువంటి హెల్మెట్‌ వాడుతున్నారు? బీఐఎస్‌ ప్రమాణాలు ఉందా?.. లేక నాసిరకమైందా? అన్న దానిపై ఇటీవల పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం వీరు సర్వే చేపట్టారు. ఈ నెల 9న నగర కమిషనరేట్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో శాంతి, భద్రతలు, ట్రాఫిక్‌ పోలీసులు వేర్వేరుగా దీన్ని నిర్వహించారు. హెల్మెట్‌ వాడుతున్న ద్విచక్ర వాహనదారులను ఆపి పరిశీలించారు. బండి నెంబరు, హెల్మెట్‌ వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రామాణికమైనదే వాడాలని దిశా నిర్దేశం చేశారు.

నాణ్యత చూడాలి

నగరంలో రోడ్ల పక్కన ఎక్కడపడితే అక్కడ నాసిరకం శిరస్త్రాణాలను విక్రయిస్తున్నారు. రూ.300 చొప్పున అమ్ముతున్నారు. కంపెనీవి అంటూ అంటగడుతున్నారు. తనిఖీలు తప్పించుకోవడానికి ఏదో ఒకటి అంటూ కొంటున్నారు. దీని వల్ల అసలుకే మోసం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షోరూమ్‌లలో ప్రామాణికమైనవే కొనాలని సూచిస్తున్నారు. నాణ్యమైన వాటిని తయారీ సమయంలోనే కఠిన పరీక్షలను తట్టుకునేలా చూసి తయారు చేస్తారు. నాణ్యమైనవి రూ.800 నుంచి రూ.వెయ్యి వరకూ ఉంటున్నాయి. ధర ఎక్కువైనా ఎంతో విలువైన ప్రాణాన్ని కాపాడుతుంది. ప్రధానంగా తలకు గాయం కాకుండా కాపాడుతుంది. మెదడుకు కూడా హాని జరగకుండా ఉంటుంది. నాసిరకమైనవి ప్రమాద సమయంలో పగలడంతో పాటు తలకు గుచ్చుకుని ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది.

అపోహలు వీడాలి

హెల్మెట్‌ను ధరిస్తే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని వైద్య నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలుతుందని, స్పాండిలైటిస్‌ వస్తుందన్న వాదన సరికాదంటున్నారు. దీని బరువు చాలా తక్కువ. 800 నుంచి 850 గ్రాముల వరకు ఉంటుంది. ఈ మాత్రానికే నరాలపై ప్రభావం చూపుతుందన్న అపోహలను వీడాలి. స్పాండిలైటిస్‌ ఉన్న వారు కూడా నిరభ్యంతరంగా వాడవచ్చని సూచిస్తున్నారు. నాణ్యమైన వాటినే వినియోగిస్తే ప్రమాద సమయంలో పగలకుండా ఉంటుంది. తలకు గాయం అయితే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. పక్షవాతం రావొచ్చు, కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది.

మొత్తం తనిఖీ చేసిన శిరస్త్రాణాలు 8,536

ఐఎస్‌ఐ ప్రమాణాలు ఉన్నవి .. 6,621

నాసిరకమైనవి .. 1,915

వాహనదారులు అర్థం చేసుకోవాలి : సర్కార్‌, ట్రాఫిక్‌ ఏడీసీపీ, విజయవాడ

హెల్మెట్‌ పెట్టుకోవడం వల్ల ప్రమాదాల సమయంలో బాగా పనికొస్తుంది. తలకు గాయం కాకుండా కాపాడుతుంది. దీన్ని వాహనాలు నడిపే వారు అందరూ ధరించడం అలవాటు చేసుకోవాలి. ప్రాణరక్షణ కోసం ఇది తప్పనిసరి. దీని వల్ల వారితో పాటు ఇంట్లో వారికి కూడా భరోసా ఉంటుంది. జీవితాన్ని బుగ్గిపాలు చేసుకోకూడదు. విజయవాడ నగరాన్ని ప్రమాదరహిత ప్రాంతంగా మార్చడంలో అందరూ కలిసిరావాలి.

ఇదీ చదవండీ..Sirisha bandla: శిరీష రోదసీ యాత్ర విజయవంతం.. తెనాలిలో హర్షాతిరేకాలు

ABOUT THE AUTHOR

...view details