ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Park Demolished: నరసన్నపేటలో పార్కు భవనం కూల్చివేత.. ఆక్రమణ కోసమేనా..! - శ్రీకాకుళం జిల్లా లేటెస్ట్​ అప్​డేట్స్​

Park Demolished: నరసన్నపేటలో కొందరు దుండగులు రెచ్చిపోయారు. ఎర్రన్నాయుడు స్మారక చిల్డ్రన్స్ పార్కును కబ్జా చేసేందుకు యత్నించారు. ఇందుకోసం తెల్లవారుజామున పార్కు ప్రహరీ, భవనం కూల్చివేశారు.

demolished a park at Narasannapeta
పార్కును కూల్చివేసిన దుండగులు

By

Published : Mar 26, 2022, 9:40 AM IST

Updated : Mar 27, 2022, 4:46 AM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్మాణదశలో ఉన్న ఎర్రన్నాయుడు చిల్డ్రన్స్‌ పార్కును కొందరు కూల్చివేశారు. గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైన ఈ పార్కు స్థలంపై కొందరు కన్నువేసి శనివారం వేకువజామున రెండు జేసీబీలతో పడగొట్టారు. ఇందిరానగర్‌ కాలనీలోని విలువైన ఈ స్థలాన్ని కొన్నేళ్లుగా కబ్జా చేసేందుకు ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. నిర్మాణ దశలో ఉన్న పార్కు ప్రహరీ, రీడింగ్‌ రూం, కార్యాలయ గదులను కూల్చడంతో పాటు అంతర్గత రహదారులను ఛిద్రం చేశారు. విద్యుత్తు తీగలను తొలగించారు. ఈ సమాచారం తెలియగానే మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి... కొందరు తెదేపా కార్యకర్తలను అక్కడకు పంపారు. కూల్చివేతను చేపట్టిన వారు తెదేపా కార్యకర్తలపై దాడి చేశారు. వారు భయపడి పరుగులు తీశారు. రమణమూర్తి పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకొని కూల్చివేతను అడ్డుకొని యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే చాలా నిర్మాణాలు పాడయ్యాయి. రమణమూర్తితో పాటు తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకొని నిరసన తెలపడంతో పాటు ధర్నా చేశారు.

కలెక్టర్‌ అనుమతులతో..
పార్కు నిర్మాణానికి అప్పటి కలెక్టర్‌ అనుమతులు మంజూరు చేయగా, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్‌ అధికారుల ఆధ్వర్యంలో పనులు మొదలయ్యాయి. దాదాపు రూ.2 కోట్ల వ్యయం అవుతుందని భావించారు. నరసన్నపేట గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ.34.50 లక్షలు విడుదల కావడంతో పనులు ప్రారంభించారు. కోఆపరేటివ్‌ బిల్డింగ్‌ సొసైటీకి చెందిన ఈ స్థలం తమకే మంజూరైందంటూ 15 మంది కోర్టును ఆశ్రయించారు. పలుమార్లు పిటిషన్లు వేయడంతో పార్కు నిర్మాణాలు పూర్తిస్థాయిలో జరగక, రెండేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు.

దోషుల్ని అరెస్టు చేయాలి...
వైకాపా ప్రభుత్వ హయాంలో పార్కులకూ రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లల పార్కుపై పెద్దల కళ్లు పడ్డాయని ఆరోపించారు. ఈ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దోషులను అరెస్టు చేసి ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని కోరారు. నరసన్నపేట మేజర్‌ పంచాయతీ వార్డు సభ్యుడు బి.ఎల్‌.శర్మతో పాటు 15 మంది ప్రమేయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసుస్టేషన్‌ వద్ద తెదేపా శ్రేణులు నిరసన తెలిపాయి.

ఇదీ చదవండి: తాడేపల్లిగూడెం నిట్‌లో ర్యాగింగ్.. 9 మంది విద్యార్థులు అరెస్ట్​

Last Updated : Mar 27, 2022, 4:46 AM IST

ABOUT THE AUTHOR

...view details