ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో తిరిగి ప్రారంభమైన విద్యాసంస్థలు

పాఠశాలలు, కళాశాలలు ఎట్టకేలకు పునఃప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి విడతల వారీగా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంకా కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో.. పిల్లలను పాఠశాలలకు పంపాలా.. వద్దా.. అని విద్యార్థుల తల్లిదండ్రులు తర్జనభర్జన పడుతున్నారు. మరోవైపు పాఠశాలలకు పంపకపోతే చదువులో వెనుకబడిపోతారేమోనని సతమతమవుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో తిరిగి ప్రారంభమైన విద్యాసంస్థలు
శ్రీకాకుళం జిల్లాలో తిరిగి ప్రారంభమైన విద్యాసంస్థలు

By

Published : Nov 2, 2020, 6:50 PM IST

శ్రీకాకుళం జిల్లాలో తిరిగి ప్రారంభమైన విద్యాసంస్థలు

శ్రీకాకుళం జిల్లాలో 3 వేల 8 వందల 89 పాఠశాలలు ఉన్నాయి. 9, 10వ తరగతిల్లో 73 వేల 9 వందల 74 మంది విద్యార్ధులు చదువుతున్నారు. రెండు వందల రెండు ఇంటర్మీడియట్‌ కళాశాల్లో 65 వేల 8 వందల మంది విద్యార్ధులు చదువుతున్నారు. కొవిడ్ మహమ్మారితో నెలల కొద్దీ విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇటీవల పాఠ్యాంశాల్లో అనుమానాల నివృత్తికి పాఠశాలలకు వచ్చేందుకు అనుమతి ఇచ్చినా.. పెద్దగా పిల్లలు స్పందించలేదు. ఇప్పుడు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. తొలిరోజు సగం మంది విద్యార్థులు పాఠశాలకు రాలేదు. అయితే ముందు ముందు వస్తారని ఉపాధ్యాయులు ఆశిస్తున్నారు.

విడతలవారీగా..

కరోనా వ్యాప్తి జాగ్రత్తల్లో భాగంగా విడతల వారీగా తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలకు రాని విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తారు. మూడో వంతు బడుల్లో నాడు-నేడు పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం 9, 10 తరగతులే మొదలయ్యాయి. ఈ నెల 23 నుంచి 6, 7, 8 తరగతులు విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయి. వచ్చే నెల నుంచి మిగిలినవారు కూడా జతవుతారు. నాడు-నేడు పనులు కారణంగా వసతి సమస్య తలెత్తే అవకాశం ఉంది..

కళాశాలల్లో తరగతులు ప్రారంభం

జూనియర్ కళాశాలల్లో తరగతులు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలుత రెండో ఏడాది విద్యార్థులకు పరిమితం చేశారు. 16 నుంచి తొలిఏడాది విద్యార్థులకు అవకాశమిస్తారు. అయితే ఎక్కువమంది పేద విద్యార్థులు కళాశాలల్లో చదువుతున్నారు. బయట ప్రదేశాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి చదివే విద్యార్ధులు ఎక్కువమంది.. వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వసతి గృహాలను తీయలేదు. దీంతో వీరంతా కళాశాలకు దూరం అవుతున్నారు. అలాగే ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్చుకోవడాని వీరికి ఆర్ధిక పరిస్థితులు అనుకూలించక.. చదువుకు దూరం అవుతున్నారు.

విద్యార్థులు భౌతికదూరం పాటించడం.. మాస్కులు ధరించేలా పర్యవేక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. మరికొంతమంది తమ పిల్లలను పాఠశాలలకు పంపకపోతే చదువులో వెనుకబడిపోతారేమోనని పంపిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినా.. అంతా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో పాఠశాలలు తెరవడం అవసరమా.. అనే ప్రశ్నలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎదురవుతున్నాయి.

ఇదీ చదవండి

ముగిసిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సర్వసభ్య సమావేశం

ABOUT THE AUTHOR

...view details